జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారు
ఖైదీలు, జైలు సిబ్బందికి మధ్య ఘర్షణను అసరాగా చేసుకుని నలుగురు విచారణలో ఉన్న ఖైదీలు పరారైయ్యారు. ఆ ఘటన బీహార్ సీతామర్హి జిల్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఖైదీలు పరారైన విషయాన్ని జైలు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దాంతో వారిని పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. పరారైన ఖైదీలు సడ్రి అలాం, సుభోద్ కుమార్, సురజ్ కుమార్, వినయ్ బైతాలుగా గుర్తించినట్లు జైలు సుపరింటెండెంట్ మంగళవారం వెల్లడించారు.
సుపరింటెండెంట్ కథనం ప్రకారం... తినే ఆహారం నాణ్యత ఉండటం లేదంటూ ఖైదీలు సోమవారం జైలులో నిరసనకు దిగారు. ఆ క్రమంలో జైలు సిబ్బందికి, ఖైదీలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో పలువురు తీవ్రంగా ఖైదీలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించడంలో జైలు సిబ్బంది తలమునకలై ఉన్న సమయంలో విచారణలో ఉన్న ఖైదీలు పరారైయ్యారన్నారు. ఖైదీలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని జైలు సుపరింటెండెంట్ వెల్లడించారు.