నాలుగు గ్రామాల్లో భూపంపిణీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితులకు భూపంపిణీకి యంత్రాంగం సిద్ధమైంది. నిర్దేశిత తేదీలో పథకం అమలు చేయాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలకు దిగిన జిల్లా యంత్రాంగం నాలుగు గ్రామీణ నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని వాటి పరిధిలో నాలుగు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసింది. ఆగస్టు 15న వీరికి భూపంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ గ్రామాల్లో..
ప్రస్తుతం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో నాలుగు గ్రామాలను గుర్తించిన అధికారులు.. వాటి పరిధిలో 19 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి మూడెకరాల చొప్పున 57ఎకరాలు పంపిణీ చేయనున్నారు. దోమ మండలం గూడూరు పంచాయతీ పరిధిలో ముగ్గురు, నవాబ్‌పేట మండలం అర్కతల పంచాయతీ పరిధిలో ఆరుగురు, మర్పల్లి మండలం కల్కోడలో నలుగురు, బషీరాబాద్ మండలం మర్పల్లిలో ఆరుగురు చొప్పున గుర్తించారు. అయితే బషీరాబాద్ మండలం మర్పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సాగుభూమికి నీటి వనరుల లభ్యత కష్టంగా ఉందని అధికారులు తేల్చారు. దీంతో ఈ గ్రామానికి బదులుగా యాలాల మండలం చెన్నారంలో భూ సర్వే చేస్తుండగా.. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
రూ.కోటి యాైభై లక్షలతో..
ఆగస్టు 15న తలపెట్టే భూపంపిణీకి జిల్లా యంత్రాంగం రూ.1.5కోట్లు ఖర్చు చేస్తోంది. ఈమేరకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేయగా.. వాటితో భూకొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మర్పల్లి మండలం కల్కొడలో మాత్రమే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా.. మిగతాచోట్ల సర్కారు విడుదలచేసిన నిధులతో భూమి కొనుగోలు చేస్తున్నారు.