free transaction
-
ఏటీఎం పరిమితులపై ఆర్బీఐకి కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఏటీఎంలలో ఉచిత లావాదేవీలపై పరిమితుల విషయంలో రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎస్బీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులు తమ సొంత ఖాతాదారులపై అనవసర పన్నులు మోపుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ సహా ఆరు మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్ ఉచిత లావాదేవీలను బ్యాంకులు అయిదింటికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వాతి అగర్వాల్ అనే అడ్వకేట్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కొన్ని బ్యాంకులు, ఐబీఏ విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్షమైనదని, సంస్కరణల స్ఫూర్తికి వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మటుకు దేశాల్లో ఖాతాదారుల సొంత బ్యాంకు ఏటీఎంలలో జరిపే లావాదేవీల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేవని వివరించారు. దీంతో హైకోర్టు తాజా నోటీసులు ఇచ్చింది. ‘సొంత ఖాతాదారులపై అనవసర భారం ఎందుకు మోపుతున్నారు? తదుపరి విచారణ తేదీలోగా మీ వివరణ ఇవ్వండి’ అంటూ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. -
మెట్రోల్లో ఇక ఏటీఎం చార్జీల మోత
* ఉచిత లావాదేవీలపై పరిమితులు నేటి నుంచే అమల్లోకి * సొంత బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 లావాదేవీలే * అంతకు మించితే రూ. 20 * హైదరాబాద్ సహా ఆరు మెట్రోల్లో అమలు న్యూఢిల్లీ: ఏటీఎంలలో ఉచిత లావాదేవీల సంఖ్యపై పరిమితులు నేటి నుంచే (నవంబర్ 1) అమల్లోకి రానున్నాయి. దీంతో ఆరు మెట్రో నగరాలకు సంబంధించి సొంత బ్యాంకుల ఏటీఎంలలో సైతం సరే నెలకు అయిదు లావాదేవీలు మాత్రమే ఉచితంగా ఉంటాయి. నగదు విత్‌డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ మొదలైనవన్నీ కూడా ఈ పరిమితికి లోబడే ఉంటాయి. అయిదుకు మించితే ప్రతీ దానికి రూ.20 చార్జీలు వర్తిస్తాయి. మరోవైపు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితి కూడా మెట్రోల్లో ఇప్పుడున్న అయిదు నుంచి మూడు లావాదేవీలకు తగ్గుతుంది. అయితే, వీటి విషయంలో ఆర్బీఐ కొంత వెసులుబాటునిచ్చింది. మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల ఏటీఎంలలో రెండు నిర్వహించుకునే వీలు కల్పించింది. తాజా మార్పులు సేవింగ్స్ అకౌంటు, కరెంటు అకౌంట్లు అన్నింటికీ వర్తిస్తాయి. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో ఈ పరిమితులు అమలవుతాయి. ఆర్బీఐ అనుమతి ఫలితం...: ఏటీఎంలు, బ్యాంకుల శాఖలు పెరగడంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఉచిత లావాదేవీల పరిమితిని కుదించవచ్చని ఈ ఏడాది ఆగస్టులో ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఎన్ని ఉచిత లావాదేవీలు అనుమతించాలన్నది ఆయా బ్యాంకులు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని వివరణ ఇచ్చింది. ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణ భారంగా మారుతోందని, పెపైచ్చు ఉచిత లావాదేవీల వల్ల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్నాయని బ్యాంకుల సమాఖ్య ఐబీఏ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆర్బీఐ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఆరు మెట్రో నగరాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉచిత లావాదేవీలు యథాప్రకారంగానే ఉంటాయి. నో ఫ్రిల్స్ అకౌంట్ల ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇప్పట్లాగానే అయిదు ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 1.6 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. -
ఏటీఎం వినియోగదారులకు వాత
న్యూఢిల్లీ: మెట్రో నగరాల్లో ఏటీఎం వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాత పెట్టింది. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ (హోమ్ బ్యాంక్) ఏటీఎం కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం (థర్డ్‌పార్టీ) ద్వారా నగదు ఉపసంహరణ ఉచిత అవకాశాలను మూడుకు పరిమితం చేసింది. ఇంతకుముందు నెలలో ఐదు ఉచిత అవకాశాలు ఉండేవి. ఇక నుంచి మూడు సార్లుకు మించి ఏటీఎం కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు డ్రా చేస్తే రూ. 20 చెల్లించాల్సివుంటుంది. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతాలకు తాజా నిబంధన వర్తించదు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎం వివరాలను తెలియజేయాలని సైతం బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.