మహర్దశ
సర్కార్ బడులకు నిధుల వరద
స్వచ్ఛ పాఠశాలల దిశగా పయనం
హరిత వనాలకు చేయూత
ప్రతి పాఠశాలకు సఫాయి కార్మికులు, వాచ్మెన్లు
రెట్టింపైన గ్రాంట్లు.. జిల్లాలో 2,950 పాఠశాలలకు ప్రయోజనం
పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. స్వచ్ఛ పాఠశాలలను రూపొందించేందుకు సర్కార్ నిధులను భారీగా కేటాయించింది. హరితహారానికి ఆయువు పట్టుగా భావిస్తున్న విద్యా సంస్థలను హరిత వనాలుగా తీర్చిదిద్ది.. సర్కార్ బడులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
పాఠశాలకో సఫాయి కార్మికుడు, నైట్ వాచ్మ¯ŒSలను నియమించుకునేందుకు వీలుగా నిధులు విడుదల చేసింది. గతంలో ఉన్న గ్రాంట్లను దాదాపు రెట్టింపు చే సింది. శౌచాలయాలు కరువై.. ఒక వేళ ఉన్నా నిర్వహణ బరువై.. శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాలలకు వెళ్లాలంటేనే విద్యార్థులు బయపడేవారు. కానీ ప్రభుత్వం చేపట్టిన కొత్త సంస్కరణలతో మౌలిక సదుపాయలకు పెద్దపీట వేస్తుంది.
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత కలిపి సుమారు 2,950 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. సుమారు 250 పాఠశాలల్లో సౌకర్యాలతో కూడిన టాయిలెట్లు లేవు. ఇటీవల సుప్రీం కోర్టు బృందం పర్యటించిన నేపథ్యంలో చాలా పాఠశాలలకు టాయిలెట్ సౌకర్యాలను మెరుగు పరిచారు. అయితే గత ఏడాది కేవలం 60 మం ది విద్యార్థులున్న పాఠశాలలకు మాత్రమే సఫాయి కార్మికులను నియమించారు. ఇతర పాఠశాలల్లో టాయిలెట్లు ఉన్నా వాటిని పట్టించుకోలేదు.
దీంతో వాటి నిర్వహణ భారం కావడంతో ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూల్ గ్రాంట్ కింద రూ.12 వేల చొప్పున ఇచ్చే వారు. ఉన్నత పాఠశాలలకు రూ.17 నుంచి రూ. 22 వేల వరకు ఇచ్చే వారు. అయితే ఆ నిధులు కనీస అవసరాలకు కూడా సరిపోలేదన్న ఆరోపణలున్నాయి.
ప్రతి పాఠశాలకు స్కావెంజర్
ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు ఓ సఫాయి కార్మికుడిని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ గ్రాంటును 40 మందిలోపు విద్యార్థులుంటే రూ.25 వేలకు పెంచారు. 40 మందికిపైగా ఉంటే రూ.30 వేలు ఇవ్వనున్నారు. ఉన్నత పాఠశాలల్లో 40 మందిలోపు ఉంటే రూ. 50 వేలు, వందమంది కంటే ఎక్కువ ఉంటే రూ.లక్ష గ్రాంటు ఇవ్వనున్నారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కొక్కరి చొప్పున సఫాయి కార్మికుడిని నియమించుకోవచ్చు. వీరికి నెలకు రూ.2 వేల చొప్పున జీతం చెల్లిస్తారు. 40 మందికిపైగా విద్యార్థులుంటే రూ.2,500 జీతం చెల్లిస్తారు. వందమందికి పైగా విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో ఇద్దరిని నియమించుకోవచ్చు. 40 మందిలోపు విద్యార్థులుంటే రూ.2,500, నలభైనుంచి వంద మంది వరకు ఉంటే రూ.3 వేలు, అంతకంటే ఎక్కువ మంది ఉంటే రూ.3,500 చెల్లించవచ్చని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కార్మికుల విధులు
పాఠశాలలో నియమితులైన సఫాయి కార్మికులు రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించాలి.తరగతి గదులు, టాయిలెట్లు శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం వీరి విధి. ఇక వాచ్మె¯ŒSలు రోజూ తరగతి గదులు శుభ్రపర్చడం, పాఠశాలకు కాపలాగా ఉండాలి.