లక్ష ఓటర్ల దరఖాస్తులు పెండింగ్ :భన్వర్‌లాల్
సాక్షి, ఒంగోలు: ఒంగోలు డివిజన్లో పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్న ఓటర్ల నమోదు దరఖాస్తులను నెలాఖరు లోపు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.
2014 సంవత్సరానికి సంబంధించి నూతన ఓటర్ల జాబితా ప్రచురించేందుకు తీసుకోవలసిన చర్యలను ఆయన అధికారులకు వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల్లో లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వీటిలో అధిక భాగం ఒంగోలు డివిజన్లో ఉన్నాయన్నారు. ఫారం 6 సంబంధించినవి 54 వేలు, ఫారం 7 ద్వారా 6 వేలు, ఫారం 8 ద్వారా 34 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులంతా ఓటర్లుగా నమోదయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకుని ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈ నెలాఖరు లోగా విచారణ పూర్తి చేసి పరిష్కరిస్తామని చెప్పారు. అదే విధంగా జిల్లాలో 11,25,828 మంది పురుష ఓటర్లు, 11,42,430 మహిళా ఓటర్లు కలిసి మొత్తం 22,68,309 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. సమీక్ష సమావేశంలో డీఆర్వో జి. గంగాధర్‌గౌడ్, డీఆర్డీఏ పీడీ ఎ.పద్మజ, కందుకూరు ఆర్డీఓ టి.బాపిరెడ్డి, మార్కాపురం ఆర్డీఓ ఎం. రాఘవరావు, పలువురు తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.