నవదంపతులకు అంత్యక్రియలు
‘అనంత’లో భార్య, బెంగళూరులో భర్త మృతదేహాలు ఖననం
అనంతపురం క్రైం:బెంగళూరు నగరంలో ఈ నెల 1న ఆత్మహత్యకు పాల్పడిన నవదంపతుల్లో భర్త మృతదేహాన్ని అనంతపురం జిల్లాలో, భార్య మృతదేహాన్ని బెంగ ళూరులో ఖననం చేశారు. యువ దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం రూరల్ నారాయణపురం పంచాయతీ పాపంపేటకు చెందిన సుబ్బారెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు సుధాకర్‌రెడ్డి (31), కోడలు గజనీశ్రీ (26) బెంగళూరు శివారులో హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గజనీశ్రీ మృతదేహాన్ని బెంగళూరులో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులు స్వాధీనం చేసుకుని అ క్కడే ఖననం చేశారు.
సుధాకర్‌రెడ్డి మృతదేహాన్ని ఆయన తల్లిదండ్రులు, బంధువులు శనివారం రాత్రి అనంతపురంలోని తన ఇంటికి తీసుకొచ్చా రు. ఆదివారం ఉదయం సొంతూరు శింగనమల మండలం ఉల్లికల్లుకు తీ సుకెళ్లి ఖననం చేశారు. కాగా...గజనీశ్రీ నాలుగు నెలల గర్భవతి. కొత్తగా పెళ్లైంది. కలకాలం సుఖ సంతోషాలతో ఉండాల్సిన దంపతులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు తలకొరివి పెట్టాల్సిన వాడు తమ కళ్లెదుటే మృత్యువాత పడడాన్ని సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.