జేసీ అండతోనే అసాంఘిక కార్యకలాపాలు
- తాడిపత్రిలో అభివృద్ధి శూన్యం
- వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి టౌన్ : తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అండతోనే తాడిపత్రిలో మట్కా, జూదం, రౌడీజం, భూకబ్జాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమస్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. తాడిపత్రిలోని భగత్‌సింగ్‌నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. తాడిపత్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోనే పలు అవార్డులు వచ్చాయని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాయన్నారు. వాస్తవంగా మట్కా, జూదం. రౌడీజం, భూకబ్జలనే ఇక్కడ అభివృద్ది చేశారని మండిపడ్డారు. కేవలం తప్పులు కప్పి పుచ్చుకోవడానికి పట్టణ పోలీస్ స్టేషన్ ప్రారంభానికి వచ్చిన డీజీపీని కలిసి వాటిని అదుపు చేయాలని ఎమ్మెల్యే జేసీ కోరారని చెప్పారు.
అదేరోజు ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి తమ అనుచరులను అరెస్టు చేయవద్దని హుకుం జారీ చేశారని తెలిపారు. జేసీ అనుచరులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రజలకు కూడా తెలుసని చెప్పారు. వీటిపై ఎన్నోసార్లు డీజీపీ, డీఐజీ, ఐజీ, ఎస్పీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో వెంటనే పట్టణ పోలీసు స్టేసన్ ఎదుట ఎమ్మెల్యే ధర్నా చేయాలని పెద్దారెడ్డి సవాల్ విసిరారు. లేకపోతే మా మిత్ర పక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలతో పట్టణ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. పట్టణంలోని సంజీవనగర్, పాతకూరగాయాల మార్కెట్ సమీపంలోని ప్రజాప్రతినిధి వ్యక్తిగత కార్యాలయం, సీబీ రోడ్డులోని ప్రైవేటు కార్యాలయం, వాటర్ వర్క్‌రోడ్డు వీధిలోని జూద గృహంపై గతంలో పోలీసులు చేసిన దాడుల్లో అధికార పార్టీకి చెందిన వారు దొరికింది నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి వస్తున్న ఒత్తిళ్లతో స్థానిక పోలీసులు కేవలం అమాయకులపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల అండతోనే తాడిపత్రి రూరల్‌తో పాటు పెద్దపప్పూరు మండలాల నుండి లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతోందన్నారు. గ్రానేటుకు సంబంధించి ఒక లారీకి రాయిల్డీ తీసుకొని అదే నెంబర్ మీదగా కొన్ని లారీలు తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు.