తమిళనాడు పీసీసీ అధ్యక్షుడి రాజీనామా
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు బీఎస్ గణదేశికన్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీకి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేసేందుకు వీలుగా ఆయన ఈ చర్య తీసుకున్నారు. పార్టీలో ఐక్యత తెచ్చేందుకు తన శాయశక్తులా కృషి చేశానని, అనేక స్థాయిల్లో పలు సమావేశాలు నిర్వహించానని అధినేత్రి సోనియాగాంధీకి ఓ లేఖ రాశారు.
పీసీసీ కమిటీని ఎలాంటి ఇబ్బంది లేకుండా పునర్వ్యవస్థీకరించేందుకు గాను తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే, అసలు గణదేశికన్ ఇప్పటికిప్పుడు ఎందుకు రాజీనామా చేశారన్న విషయం మాత్రం ఇంకా తెలియడంలేదు. వాస్తవానికి తమిళనాడు కాంగ్రెస్‌లో సవాలక్ష గ్రూపులున్నాయి. కేంద్ర మాజీమంత్రి జీకే వాసన్‌కు పార్టీలో ఎక్కువ మంది మద్దతుంది. మరో మాజీ మంత్రి చిదంబరానిది మరో వర్గం. చాలాకాలంగా కలిసున్న డీఎంకే కూడా యూపీఏ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీని నడపడం కన్నా.. పక్కకు వెళ్లిపోవడమే మేలని గణదేశికన్ భావించినట్లు సమాచారం.