బాబూ.. దయ చూపవా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కరుణ కోసం విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం సోమన్నపాలెం గ్రామానికి చెందిన వృద్ధుడు గంధవరపు ఇర్నయ్య అయిదు రోజులుగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడు మాత్రం కనిపించటం లేదు.
ఇర్నయ్యకు సోమన్నపాలెంలోని సర్వే నంబరు 237.72లో ఉన్న 20 సెంట్ల భూమిలో 13 సెంట్ల భూమిని నారు యల్లాజీ, నరం బసవయ్య కొనుగోలు చేస్తామని చెప్పి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగిలిన ఏడు సెంట్ల భూమి తనది అని యల్లాజీ చెబుతున్నారు. తన భూమిని అన్యాయంగా లాక్కున్న వారిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని ఈ నెల 12న విశాఖపట్నంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరైన చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించినట్లు ఇర్నయ్య తెలిపారు.
తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్య తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించినా స్పందన లేదని, దీంతో మరోసారి సీఎంను కలిసి విన్నవిద్దామనే ఉద్దేశంతో లేక్‌వ్యూ అతిథిగృహం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చుట్టూ తన కుమార్తె పెంటమ్మతో కలిసి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని, సీఎంను కలవనివ్వటం లేదని తెలిపారు. తనకు న్యాయం చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆయన కనిపించిన వారందరినీ దీనంగా వేడుకుంటున్నారు.