గ్యాంగ్స్టర్ భార్య దారుణహత్య
గుర్గావ్: దేశరాజధాని ఢిల్లీ శివారున ఉన్న హరియాణాలోని గుర్గావ్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు గ్యాంగ్స్టర్ భార్యను కాల్చిచంపారు. గ్యాంగ్స్టర్ అశోక్ రతి భార్య సుష్మా (28) తన ఎనిమిదేళ్ల కూతురును స్కూలులో వదిలిపెట్టి ఇంటికి తిరిగివస్తుండగా ఆమెపై కాల్పులు జరిపారు. ఇద్దరు లేదా ముగ్గురు దుండగులు ఈ దాడిలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుష్మా శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయని, ఆమె అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు.
అశోక్ రతి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. గుర్గావ్ పక్కన అలీపూర్ గ్రామంలో సుష్మా ఉంటోంది. తన భర్త నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరు నెలల క్రితం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశోక్ గతంలో అత్త, బావమరిదిని హత్య చేశాడని, ఈ కేసులో అతనికి జీవిత కారాగార శిక్ష పడినట్టు పోలీసులు చెప్పారు. దోపిడీ, హత్యాయత్నం, హత్య వంటి 26 కేసులు అతనిపై నమోదయ్యాయి.