రంగస్థల దర్శకుడు గంటాకు అక్కినేని అవార్డు
పాలకొల్లు, న్యూస్‌లైన్ : ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో అక్కినేని నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో క్రియేటర్స్ పాలకొల్లు వారు ప్రదర్శించిన ‘తప్పుటడుగులు’ నాటికకు దర్శకత్వం వహించి న గంటా రామమోహనరావు అవార్డు అందుకున్నారు. ఉత్తమ సాంకేతిక దర్శకుడు అవార్డును ఆయన అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం గంటా రామమోహనరావు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం 90వ పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కినేనికి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొల్లులో వేసిన నాటకాలు, అక్కడి కళాపోషకుల దాతృత్వం ఎప్పటికీ మరువలేనని అక్కినేని తన వద్ద ప్రస్తావించారని చెప్పారు. ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) తదితరులు గంటాను అభినందించారు.