ఐటీడీఏ పాలకవర్గ సమావేశం @ : 7 నెలలు
సీతంపేట(పాలకొండ): ‘ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తున్నాం.. కేవలం మూడుగంటల్లోనే ముగిస్తున్నాం.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.. గిరిజన సమస్యలపై సుదీర్గ చర్చ సాగాలి.. సమావేశాలు ప్రతి మూడునెలలకు ఒకసారి కాకుండా రెండునెలలకు ఒకసారి నిర్వహిద్దాం’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ గత పాలకవర్గ సమావేశంలో మొదటి ప్రశ్న లేవనెత్తారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సభ్యులు కలిసి తీర్మానం చేశారు.
తరచి చూస్తే...
రెండు నెలలు కాదు.. మూడు నెలలు కాదు.. ఏకంగా ఏడు నెలలైంది. పాలకవర్గ సమావేశానికి అతీగతీ లేదు. గతే ఏడాది జూన్ 23న పాలకవర్గ సమావేం నిర్వహించారు. అంతే.. అప్పటి నుంచి సమావేశం నిర్వహణకు చర్యలు తీసుకున్నవారే కరువయ్యారు. ఫలితం.. గిరిజన పల్లెల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా చర్చించేవారే లేరు. మౌలిక సదుపాయాల కల్పన, నిధుల వినియోగం, సమస్యల గుర్తింపు వంటి వాటిపై ప్రశ్నిం చే అవకాశం లేకుండా పోయిందంటూ గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. నేతలు, ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నా యి.
సమస్యలు వెంటాడుతున్నా...
ఐటీడీఏ పరిధిలోని 150 గ్రామాల్లో ఏటా తాగునీటి సమస్య తలెత్తుతోంది. నివార ణా చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. చాలా గ్రామాలకు రోడ్డు సదుపాయాలు లేవు. నిర్మాణానికి వేసవి కాలం అనువైనది. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదు. పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. జీసీసీ గిట్టుబాటు ధరలు కల్పన, విద్య, వైద్యసదుపాయాల కల్పన, హార్టీకల్చ, ఐడబ్ల్యూఎంపీ, చిన్ననీటి వనరులు తదితర శాఖలపై చర్చించాల్సి ఉంది. గిరిజనుల అభివృద్ధికి పునాది పడాల్సిన సమావేశం నిర్వహణలో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గిరిజన సమస్యల పరిష్కారంలో టీడీపీ ప్రభుత్వం అలక్ష్యం చేస్తోందంటూ గిరిజన సంఘాల నేతలు దుయ్యబడుతున్నారు. ఇదే విషయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎల్.శివశంకర్ వద్ద ఫోన్లో ప్రస్తావించేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఐడీడీఏ ఏపీవో ఆర్.శ్యామ్యుల్ వద్ద ప్రస్తావించగా ఐటీడీఏ సమావేశ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
గిరిజన సమస్యలంటే ప్రభుత్వానికి లెక్కలేదు..
గిరిజన సమస్యలను పట్టించుకోవడం మానేశారు. రెండు నెలలకు పాలక వర్గ సమావేశాలు పెడతామని ఏడు నెలలకు కూడా పెట్టకపోతే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పటికే గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. గవర్నింగ్ బాడీ సమావేశాలు పెట్టడం ఆలస్యమైనా కనీసం ఐటీడీఏ ఉన్నతాధికారులైనా క్షేత్రస్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలతోనైనా సమావేశం పెట్టి సమస్యలు తెలుసుకుంటే బాగుండేది.
–విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే