భారత్లో అపార అవకాశాలు
- సంస్కరణల జోరు పెంచండి
- జీఈ చైర్మన్ జెఫ్ ఇమెల్ట్
ముంబై: భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశంలో అవకాశాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయని అమెరికాకు చెందిన డైవర్సిఫైడ్ దిగ్గజ కంపెనీ జీఈ పేర్కొంది. భారత్లో వ్యాపారం మరింత సులభంగా చేయాలంటే మరిన్ని సంస్కరణలను వేగంగా అమలు చేయాలని జీఈ చైర్మన్, సీఈఓ జెఫ్ ఇమెల్ట్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణల వల్ల భారత్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ సంస్కరణలను త్వరగా అమలు చేయాల్సి ఉందని చెప్పారు.
సోమవారం ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. భారత్లో వాస్తవ మార్పుల ముద్రలను విదేశీ ఇన్వెస్టర్లు గమనిస్తున్నారని చెప్పారు. జీఈతో తనకు 33 ఏళ్ల అనుబంధమని, ఎన్నోసార్లు భారత్కు వచ్చానని, కానీ, ఇప్పుడు క్షేత్ర స్థాయిలో నిజంగా మార్పులు వస్తున్న విషయం ఇప్పుడు అవగతమవుతోందని వివరించారు. భారత రైల్వేల ఆధునికీకరణ వాస్తవ రూపం దాలుస్తోందని అనిపిస్తోందన్నారు.
విద్యుత్తు రంగంలో మరిన్ని సంస్కరణలు...
విద్యుత్తు రంగంలో మరిన్ని సంస్కరణలు రావాలని ఇమ్మెల్ట్ చెప్పా రు. విద్యుత్తు ధరలకు సంబంధించి సబ్సిడీలను తగ్గించాలని, ఈ ధరలను మార్కెట్ వర్గాలే నిర్ణయించే పరిస్థితులు ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.