పోరు షురూ
కర్నూలు
శాసనసభ, లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు మే నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చింది. అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది.
మునిసిపల్, సాధారణ ఎన్నికలు ఒకేసారి రావడంతో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ నియోజకవర్గాల వారీగా ఏడు టీములను(వీడియో సర్వే లైన్ టీమ్, వీడియో వీవింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వే లైన్స్ టీమ్, మెడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్, సెక్టోరల్ ఆఫీసర్ టీమ్) నియమించారు. ఈ బృందాలకు బుధ, గురువారాల్లో శిక్షణనివ్వనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం కూడా పూర్తయింది.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఏప్రిల్ 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ.. 21న పరిశీలన.. 23న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం కల్పించారు. మే నెల 7న పోలింగ్ నిర్వహించనుండగా.. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లా మొత్తం మీద 29,64,148 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 13,959 మంది అధికంగా ఉండటం విశేషం. ఎన్నికల్లో వీరు కీలకం కానున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో 1400, గ్రామీణ ప్రాంతాల్లో 1200 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
ఎన్నికల వ్యయం లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొద టి స్థానంలో ఉన్నట్లు వెల్లడయిం ది. ఈ దృష్ట్యా వ్యయ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. సాధారణ ఎన్నికల్లో పోటీలోని అభ్యర్థులు నచ్చకపోతే ఆ విషయాన్ని ఓటర్లు స్పష్టం చేసేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేపట్టింది. ఈవీఎం లోని బ్యాలెట్ యూనిట్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. పేర్ల కింద నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ) అనే బటన్ ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న వారెవరూ నచ్చకపోతే నోటా బటన్ నొక్కి ఓటరు అభిప్రాయం వెల్లడించే అవకాశం కల్పించారు.