పంజాబ్ లో కిరాతకం
ఘరంగ్నా: పంజాబ్ లో దళిత యువకుడి హత్య సంచలనం రేపింది. మాన్ సా జిల్లాలోని ఘరంగ్నా గ్రామంలో సుఖచైన్ సింగ్ పాలి(22) అనే దళిత యువకుడు సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. దుండగులు అతడి ఎడమ కాలును నరికేసి పట్టుకుపోయారు. మృతదేహాన్ని మాన్ సా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఎడమ కాలు దొరికేవరకు, నిందితులను అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని ఖననం చేయబోమని సుఖచైన్ సింగ్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం వ్యాపారంలో తలెత్తిన గొడవలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి గ్రామానికి తిరిగొస్తుండగా తన కొడుకుపై అగ్రకులానికి చెందిన వారు దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుఖచైన్ సింగ్ తండ్రి రేష్మమ్ సింగ్ ఆరోపించారు. ఆమన్ దీప్ సింగ్, బల్బీర్, సీతా సింగ్, బాబ్రీఖ్ సింగ్, హరదీప్ సింగ్, సాధు సింగ్ లపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు మాన్ సా ఎస్ ఎస్ పీ ముఖ్విందర్ సింగ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.