మా ఉద్యోగాలు మాక్కావాలి
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: మా ఉద్యోగాలు మాకే కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కొందరు అధికారులు రూపొందించిన ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు మాకొద్దన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో శనివారం తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు డాక్టర్ పాపయ్య, అశోక్‌కుమార్, టీచర్ల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, నేతలు పులిరాజు, గాలిరెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మార్గదర్శకాల వల్ల 55 వేల ఉద్యోగాలకు మాత్రమే విభజన
వర్తిస్తోందన్నారు. ఇది అశాస్త్రీయం, అన్యాయమన్నారు. రాజ్యాంగ, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
జిల్లా జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయి ఆఫీసులు, ప్రాజెక్టులలో ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణకు వచ్చిన ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాల్సిందేనన్నారు. గిర్గ్లాని కమిషన్ ఉద్యోగుల నియామకాల్లో 18 రకాల ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించి, వీటిని సవరించాలని సిఫార్స్ చేసినప్పటికీ ఆమలు చేయలేదన్నారు. ఇప్పుడైనా అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోకల్ రిజర్వేషన్లు సైతం తుంగలో తొక్కార న్నారు. 58:42 నిష్పత్తిలో ఉద్యోగాలను కేటాయించాలని, ఖాళీలు ఏర్పడితే ఎక్కడి ప్రభుత్వాలు అక్కడే భర్తీ చేసుకోవాలన్నారు.
నాన్‌లోకల్ ఉద్యోగుల పట్ల తమకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రాంత పాలనలో సవరించాల్సిందేనన్నారు. స్థానిక నివాస తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి అక్రమంగా జొరబడ్డ ఉద్యోగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రభుత్వాన్ని ఇక్కడి పాలకులు, ఉద్యోగులే నడుపుకుంటారన్నారు.