78 ఏళ్ళ వృద్ధుడితో..
ఆమెకు కేవలం తొమ్మిదేళ్ళు.. పెళ్ళంటే ఏమిటో తెలియని వయసు... కానీ సంప్రదాయం ఆమెను వివాహం ఉచ్చులో దింపింది. తాత వయసున్న 78 ఏళ్ళ ముసలాడికి కట్టబెట్టింది.కెన్యాలోని గిరిజన తెగకు చెందిన యూనిస్.. వారి సంప్రదాయ చట్రంలో ఇరుక్కుపోయింది. తల్లిదండ్రుల బలవంతంతో వృద్ధుడితో ఉండాల్సి వచ్చింది. నాలుగేళ్ళ నరకం తర్వాత అతగాడినుంచి తప్పించుకొని.. కనీసం చెప్పులు కూడ లేకుండా సంబురాలు గరల్స్ ఫౌండేషన్ నడుపుతున్న బోర్డింగ్ స్కూలుకు చేరింది.
యూనిస్ కథ.. విన్నవారికి గుండె చెలించిపోతుంది. ఆమె వేధింపులకు గురైన తీరు విన్న వారికి కంట తడి పెట్టిస్తుంది. ''నాకు తొమ్మిదేళ్ళుండగా మా నాన్నఓ 78 ఏళ్ళ వృద్ధుడికిచ్చి వివాహం చేశారు. అతడు నువ్వు నా భార్యవి అన్నాడు. కానీ నాకప్పటికి ఏమీ తెలియదు. నా వయసున్న వారితోపాటు స్కూలుకు వెళ్ళి చదువుకోవాలని కోరికగా ఉండేది. కానీ అతడు నన్ను తన మూడో భార్యగా ఉండాలని చెప్పాడు. దానికి నేనేమాత్రం ఒప్పుకోలేదు. అంటూ యూనిస్... తన భయంకరమైన అనుభవాన్ని చెప్తుంది.
అదృష్టవశాత్తు అతగాడి ఉచ్చునుంచి బయటపడిన యూనిస్ కు తనవంటి వారిని ఓ మహిళ చేరదీస్తోందని తెలిసింది. అదే సంబురాలు ఫౌండేషన్... మరో రెండువందల మంది బాలికలు జోసెఫిన్ కూలియా నడుపుతున్న ఆ ఫౌండేషన్ నీడన తలదాచుకుంటున్నారు. నన్ను చూసిన కూలియా రక్షించి, తన కార్యాలయంలోకి తీసుకొని వెళ్ళింది. కుటుంబాలు వదిలేసిన.. లైంగిక వివక్షకు, వేధింపులకు గురౌతున్న... బాలికలను కూలియా చేరదీసి రక్షణ కల్పిస్తోంది. భయానక సంఘటనలను ఎదుర్కొనేందుకు సహాయపడుతోంది.
ఇతర ఏ కమ్యూనిటీలో లేని సంప్రదాయం సంబురాలు తెగలోనే కొనసాగుతోందని అదే తెగకు చెందిన కూలియా జోసెఫిన్ చెప్తోంది. ''నేను ఓ నిర్ణయానికి వచ్చాను. బలవంతంగా కొనసాగుతున్న ఆచారం నుంచి బాలికలను బయటకు తెచ్చేందుకు ఫౌండేషన్ ప్రారంభించాను. నిజానికి కెన్యాలో బాల్య వివాహాలు చట్ట విరుద్ధం. కానీ సంబురాలు సమాజంలో ప్రజలు, సంఘాలు అది పాటించడం లేదు. అందుకే వారి బారినుంచీ బాలికలను రక్షించాలని నేను నిర్ణయించుకున్నాను'' అంటారు జోపెఫిన్.
సంబురాలు తెగలో పుట్టి ఈ సంప్రదాయాలను వ్యతిరేకించడం సరికాదు. నువ్వు నీ పోరాటాన్ని ఆపమని సంఘంలోని వారెందరో నన్ను బెదిరిస్తుంటారు. నా జీవితానికి ఎప్పటికైనా ఇది ప్రమాదమే కావచ్చు. కానీ నేను మరింత ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాను అంటుంది జోసెఫిన్. జోసెఫిన్... సంస్థ ప్రారంభించడానికి ప్రధాన కారణం ఆమె బంధువుల్లోని బాలికలకు అటువంటి కష్టం ఎదురు కావడమే. తన ఇద్దరు కజిన్స్ పదేళ్ళ వయసులోనే పెళ్ళి పేరుతో శిక్షకు గురయ్యే సందర్భాన్ని ఆమె కళ్ళారా చూసింది. వెంటనే నిర్ణయించుకుంది. వారిని రక్షించి స్కూలుకు పంపించాలని నిర్ణయించుకుంది. అందుకే మరో వివాహానికి వెడుతున్నట్లుగా చెప్పి వారిని ఆ కూపంనుంచీ మెల్లగా బయటకు రప్పించింది.
గిరిజన తెగలోని మరో సంప్రదాయం బాలికకు మెడనిండా పూసల నెక్లెస్ లను కొని వేయడం. అదే వంశంలోని కొందరు వివాహం ముందే బాలికలతో సెక్స్ సంబంధాలను కొనసాగించేందుకు వారి మెడలో పూసల గొలుసులను వేస్తుంటారు. ఏ అమ్మాయి ఎక్కువ గొలుసులు వేసుకుందో ఆమెను కొనేందుకు పురుషులు మరింత ఖర్చుచేస్తుంటారు. ఇటువంటి మూఢాచారాలు, ప్రాచీన సంప్రదాయాల బారినుంచీ బాలికలను రక్షించడమే ధ్యేయంగా జోసెఫిన్ పనిచేస్తోంది. ఏడేళ్ళ వయసు బాలికలు దాటుతుందంటే వారిని పూసల బారినుంచీ రక్షించేందుకు వారి తల్లులకు అవగాహన కల్పిస్తోంది. ఇలా మరింత మందిలో అవగాహన పెంచి... భవిష్యత్తులో తమ కమ్యూనిటీలోని బాలికలంతా స్కూల్లో హాయిగా చదువుకునేలా చూడాలని జోసెఫిన్ ఆరాటపడుతోంది.