నాతో వచ్చేయ్ లేకుంటే.. అందర్నీ చంపేస్తా..!
⇒ మరణించిన స్నేహితురాలు పిలుస్తోందంటూ..
⇒ మానసిక వేదనతో బాలిక ఆత్మహత్య
⇒ పుంగనూరులో విషాదం...
పుంగనూరు: ‘‘అమ్మా.. చనిపోయిన నా స్నేహితురాలు మమత నన్ను రోజూ రమ్మని పిలుస్తోంది. లేకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తోంది. ప్రతి అమావాస్యకూ నన్ను చెరువులోకి తీసుకెళ్లి నాకు తోడు ఎవరూ లేరు నాతో వచ్చేయ్ లేకపోతే అందర్నీ చంపేస్తా అంటూ బెదిరిస్తోంది. అందుకే నేను మమత వద్దకు వెళ్లిపోతున్నా బాయ్.. బాయ్.. నాకోసం బాధపడవద్దు. నాన్నకు, అన్నకు చెప్పండి.
నేను చనిపోతున్నా’’ అంటూ యువతి లేఖరాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రకాశం కాలనీలో చోటుచేసుకుంది. హృదయ విదారకమైన ఈ ఘటన పుంగనూరులో కలకలం రేపింది. ప్రకాశం కాలనీకి చెందిన సత్యనారాయణ, నారాయణమ్మ కుమార్తె కల్పన (15) స్థానిక బాలికల హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన కల్పన రామసముద్రం రోడ్డులోని పటాలమ్మ ఆలయం వద్ద బావిలో దూకింది.
కొద్దిగా ఆలస్యంగా గమనించిన గ్రామస్తులు బాలికను కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అప్పటికే కల్పన మృతి చెందింది. బావి వద్ద ఆమె రాసిన లేఖ దొరికింది. ఆ లేఖలో కల్పన పేర్కొన్న మేరకు.. ఇదే కాలనీకి చెందిన మమత ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. ఆ నాటి నుంచి కల్పనకు నిత్యం ఆమె కలలో కనిపిస్తుండేదనీ.. తనవద్దకు రాకపోతే కల్పనతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తానని చెబుతున్నట్టు పేర్కొంది.
మానసిక వేదన ఎక్కువ కావడంతో కల్పన ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఎస్ఐ అంజనప్ప కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మా కన్నా స్నేహితురాలే ఎక్కువైందా తల్లీ..
కల్పన ఆత్మహత్య చేసుకున్న బావి వద్దకు చేరుకుని తల్లిదండ్రులు బోరున విలపించారు. ‘15 ఏళ్లుగా కష్టపడి పెంచామే.. మా కన్నా స్నేహితురాలే ఎక్కువైందా..మేము ఏం పాపం చేశామని మాకు ఈ శిక్ష వేశావు’ అంటూ తల్లి రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.
మూఢ నమ్మకాలతోనే బాలిక బలి
ఆత్మలు, ప్రేతాత్మలు అమావాస్య నా డు రావడం, పిలవడం అంతా భ్రమ. తీవ్రమైన మానసిక రుగ్మత కారణంగానే కల్పన ఆత్మహత్య చేసుకుంది. మానసికంగా ఇబ్బందిపడుతున్న పిల్లలకు తాయత్తులు కట్టించడం, మంత్రా లు వేయించడం తల్లిదండ్రులు చేయరాదు. మానసిక వైద్యులను సంప్రదిం చాలి. పిల్లల సంరక్షణపై జాగ్రత్తలు తీసుకోవాలి. - ఎన్బీ సుధాకర్‌రెడ్డి,
మానసిక శాస్త్ర నిపుణుడు