కిరాతక భర్తకు పదేళ్ల జైలు
మహిళా కోర్టు తీర్పు
విశాఖ లీగల్ : అదనపు కట్నం కోసం భార్యను కిరాతకంగా హింసించి ఆమె మృతికి కారణమైన భర్తకు నగరంలోని మహిళా కోర్టు ప్రత్యేక నాయమూర్తి ఎ. వరప్రసాదరావు పదేళ్ల కఠిన కారాగార శిక్ష,రూ. 1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అలాగే అదనపు కట్నం కోసం వేధించినందుకు సెక్షన్ 498ఎ కింద మూడేళ్ల జైలు, రూ. 500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో నెల రోజుల సాధారణ జైలు అనుభవించాలని తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్. రామ్మూర్తి నాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు నల్ల అప్పలరాజు గాజువాక పోలీస్స్టేషన్ పరిధిలోని భానోజీతోట నివాసి.
2006లో జి.లావణ్య (20)తో అతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టిన తర్వాత లావణ్యకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె 2011 ఏప్రిల్ 28న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మే 29న తుది శ్వాస విడిచింది. ఆమె తల్లి దేవి ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. గాజువాక 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జి.రామకృష్ణ లావణ్య మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.