కార్పొరేట్ల కోసమే ల్యాండ్ బ్యాంక్
- జీవో 155 ఉపసంహరించుకోవాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
విజయవాడ
కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమే రాష్ర్టంలో 10లక్షల ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. పేదలు, దళితుల భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 155ను ఉపసంహరించుకోవాలని సోమవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జీవో నంబర్ 155ద్వారా పేదలు, దళితుల వద్ద అసైన్డ్ భూములను నామమాత్రపు రేటు ఇచ్చి భూములు లాక్కొని కార్పొరేట్ శక్తులకు, పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టానికి అనుగుణంగా బహిరంగ మార్కెట్ విలువపై గిరిజన ప్రాంతాల్లో 1.5రెట్లు, షెడ్యూలేతర ప్రాంతాల్లో 1.25 రెట్లు, అదనంగా 12శాతం చెల్లించి భూ సేకరణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయా నిబంధనలను తుంగలో తొక్కి బేసిక్ విలువ చెల్లింపు పేరుతో పేదల భూములు దోచుకోవడానికి ప్రయత్నాలు సాగించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలను చేపడితే ప్రజా ఉద్యమం ద్వారా ప్రతిఘటిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.