టీసీఎస్‌ను వెళ్లనివ్వం
పుణే: కార్యాలయం మూత వార్తలతో ఆందోళనలో పడ్డ టీసీఎస్ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ భారీ ఊరట కల్పించింది. భారతదేశ అతిపెద్ద సాష్ట్‌వేర్ భీమా సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లక్నోయూనిట్కు మూసివేతకు అనుమతించమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి ప్రకటించారు.
రాష్ట్ర రాజధాని నుంచి టీసీఎస్ కార్యాలయం తరలి పోవడానికి తాము అనుమతించమని, దీనికి సంబంధించి అంశాలను పరిశీలిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ పిటిఐకి తెలిపారు. అవసరమైతే టీసీఎస్‌తో సంప్రదిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉద్యోగులకు భరోసా ఇచ్చిన అనంతరం మరోసారి ఈ విషయంలో ఆర్థిక మంత్రి ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
లక్నో ఆఫీసు మూతతో తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే ఆందోళన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులకు టీసీఎస్ ఉద్యోగులు లేఖలు రాశారు. దీంతో మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, మొహ్సిన్ రాజా ఉద్యోగలు ప్రయోజనాలను కాపాడతామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రి మౌర్య ఇందుకు అవసరమైతే టీసీఎస్ యాజమాన్యంతో చర్చలు నిర్వహిస్తామని ప్రకటించారు.
కాగా లక్నోలోని టీసీఎస్ యూనిట్‌ను మూసివేస్తున్నట్టు గతవారం వార్తలు కలకలం రేపాయి. మరోవైపు ఉద్యోగులను తొలగించడంలేదని రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నిస్తామని టీసీఎస్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.