'అమ్మ' కోసం బంగారు ఆలోచన..
చెన్నై: అతడు అన్నాడీఎంకే పార్టీకి అభిమాని. ఎంజీ రామచంద్రన్ అంటే ఇష్టం. ముఖ్యమంత్రి జయలలిత అంటే ఆకాశమంత అభిమానం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి, అమ్మ మరోసారి సీఎం అయిన వేళ అభిమానాన్ని చాటుకోవడం ఎలా అని ఆలోచించాడు. అంతే బంగారం లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే దానిని ఆచరణలో పెట్టాడు. తమిళనాడు రాష్ట్రం చిదంబరానికి చెందిన ముత్తుకుమరన్ బంగారు నగల తయారీదారుడు. 20 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉంటూ ఎంతో అనుభవం పొందాడు. ముఖ్యంగా బంగారంతో సూక్ష్మమైన వస్తువులను తయారు చేయడంలో దిట్ట. గతంలో 90 మిల్లీగ్రాములతో తాళి, 140 మిల్లీ గ్రాములతో సీలింగ్ ఫ్యాన్, 2 గ్రాములతో నటరాజ ఆలయం, 8 గ్రాములతో తాజ్మహల్ తదితర సూక్ష్మ వస్తువులను తయారు చేశారు.
ప్రస్తుతం అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి రావడాన్ని పురస్కరించుకుని 3 గ్రాముల 400 మిల్లీగ్రాములతో తమిళనాడు అసెంబ్లీ భవనం, దానిపైన జాతీయ పతాకం, పక్కనే ముఖ్యమంత్రి జయలలిత బొమ్మను తీర్చిదిద్దాడు. ముత్తుకుమరన్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులందరికీ జయలలిత అంటే ప్రాణమని, ప్రతిపక్ష పార్టీలన్నీ కట్టకట్టుకుని ఎదురు నిలిచినా అమ్మ అఖండ విజయం సాధించారని అన్నారు. ఇంతటి అపూర్వ ఘట్టాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, అమ్మను ప్రత్యేకంగా ఎలా అభినందించాలా అని ఆలోచించి ఇవి రూపొందించినట్లు వివరించాడు.