మావో నేత మాధవ్ ఎన్కౌంటర్
మల్కనగిరి (ఒడిశా)/సీలేరు (విశాఖ): మావోయిస్టు పార్టీ కీలక నేత మాధవ్ అలియాస్ గొల్ల రాములు శుక్రవారం ఉదయం ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. మల్కనగిరి జిల్లా లమతాపుట్ సమితి ప్రాంతంలో వారం రోజులుగా మాధవ్ సంచరిస్తున్నట్లు రహస్య సమాచారం అందడంతో మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల ఎస్ఓజీ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. లమతాపుట్ సమితి చిలిబా గ్రామ సమీపంలోని కొండలపై శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మాధవ్ మృతి చెందినట్లు మల్కనగిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ వెల్లడించారు. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా అని తెలిపారు. మరో నలుగురు మావోయిస్టులు తప్పించుకుని పరారైనట్లు ఆయన చెప్పారు.
సంఘటనా స్థలం నుంచి మృతదేహంతో పాటు ఒక హ్యాండ్ గ్రెనేడ్‌ను, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొరాపుట్ తరలించినట్లు చెప్పారు. మల్కనగిరి జిల్లా కలెక్టర్ వినీల్‌కృష్ణ కిడ్నాప్, అల్లంపాక వద్ద జరిగిన దాడిలో 38 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మృతి, మల్కనగిరి నుంచి చిత్రకొండ తరలిస్తున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కోటి రూపాయల నగదు దోపిడీ, చిత్రకొండ వద్ద బీఎస్ఎఫ్ కమాండెంట్లపై దాడి తదితర భారీ సంఘటనలతో మాధవ్ ప్రమేయం ఉందని ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ చెప్పారు. మాధవ్‌పై పది హత్య కేసులతో పాటు కాంట్రాక్టర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినందుకు కూడా పలు కేసులు ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రా-ఒడిశా బోర్డర్ మల్కనగిరి డివిజన్ కమిటీలో చిత్రకొండ ఏరియా కమాండెంట్‌గా కీలక సభ్యుడైన మాధవ్ తలపై ఆంధ్రప్రదేశ్‌లో రూ.4 లక్షల రివార్డు ఉందని చెప్పారు. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న మాధవ్ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. గత ఏడాది మల్కనగిరి జిల్లాలోనే మావోయిస్టు మిలీషియా కమాండెంట్ వంతల రాజారావు పోలీసులకు లొంగిపోగా, తాజా సంఘటనలో మాధవ్ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు. కీలకమైన నేతను కోల్పోవడంతో మావోయిస్టు పార్టీ ప్రతీకార చర్యలకు తెగబడే ప్రమాదం ఉండటంతో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
పాలమూరు నుంచి మాధవ్ ప్రస్థానం...
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో శుక్రవారం ఎన్‌కౌంటర్‌కు గురైన మాధవ్ అలియాస్ గొల్ల రాములు (35) మహబూబ్‌నగర్ జిల్లా వాసి. మహబూబ్‌నగర్ జిల్లా గోప్లాపూర్ గ్రామానికి చెందిన గొల్ల గౌరమ్మ, పెంటయ్య దంపతుల కుమారుడైన రాములు, ఐదో తరగతి వరకు స్వగ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాన్‌గల్‌లోని ప్రభుత్వ పాఠశాలలోను, తొమ్మిది, పదో తరగతులు వనపర్తిలోను పూర్తి చేశాడు. వనపర్తి ప్రభుత్వ కళాశాలలో 1996-97లో ఇంటర్లో చేరిన రాములు ఎస్ఎఫ్ఐ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అదేకాలంలో జననాట్య మండలిలో చేరి, నక్సల్ ఉద్యమం పట్ల ఆకర్షితుడై, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నల్లమల సరిహద్దు జిల్లాల్లో జననాట్య మండలి నేతగా సుపరిచితుడైన రాములు, మావోయిస్టు పార్టీలో దళ కమాండర్ స్థాయికి ఎదిగాడు. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తిన తర్వాత ఏవోబీకి వెళ్లిన దళాల్లో రాములు కూడా ఉన్నాడు.