గూండాలు లేరు.. సంతోషం
ఉత్తరప్రదేశ్ రాజకీయాల మీద మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌కు మక్కువ తగ్గలేదు. తరచు యూపీ రాజకీయాలపైనే ట్వీట్లు చేస్తున్నాడు. తాజాగా బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పరోక్షంగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అక్రమ కబేళాలను నిషేధిస్తూ యోగి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నోలోని ప్రఖ్యాత 'తుండే కబాబ్' అనే కబాబ్ సెంటర్ వ్యాపారం బాగా తగ్గింది. తమకు గొడ్డు మాంసం దొరక్కపోవడంతో కబాబ్‌లు తయారు చేయలేకపోతున్నామని దాని నిర్వాహకులు తెలిపారు. ఆ విషయం మీదే ఇప్పుడు కైఫ్ ట్వీట్ చేశాడు. 'తుండే మిలే యా న మిలే.. గూండే న మిలే' అని చెప్పాడు.
అంటే, తుండే కబాబ్ ఉన్నా లేకపోయినా గూండాలు మాత్రం లేకపోవడం సంతోషమని అర్థం వచ్చేలా చెప్పాడు. మొత్తం గ్యాంగ్స్టర్లు, గూండాలు అందరినీ రాష్ట్రం నుంచి బయటకు విసిరి పారేయాలన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గూండాలు లేకుండా ఉండే పరిస్థితి చూడటం ఆనందకరంగా ఉందని చెప్పాడు. అక్రమ వ్యవహారాలు అన్నింటినీ ఆపేయాలని, ఇప్పుడంతా బాగా జరుగుతోందని వ్యాఖ్యానించాడు. చివర్లో 'యూపీ షుడ్ గో అప్' అని.. రాష్ట్రం పురోగతి సాధించాలని అర్థం వచ్చేలా తెలిపాడు.
కొసమెరుపు:
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మీద పోటీ చేసి ఓడిపోయిన కైఫ్.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని వరుసపెట్టి ప్రశంసిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కూడా యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సాధించిన బ్రహ్మాండమైన విజయానికి అభినందనలు అంటూ మోదీని, బీజేపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
Tunday milein ya na milein,Gundein na milein!Will be happy to see No Gunday in UP.All illegal stuff must be stopped.Good moves #UPshouldgoUP
— Mohammad Kaif (@MohammadKaif) 25 March 2017