ఇప్పటికింకా నా వయసు..!
మనదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలు హిమాలయాలే. ఎముకలు కొరికేసే చలి ఉండే ఆ పర్వత శ్రేణుల్లో ఒకసారి పర్యటించడమే కష్టసాధ్యమైన పని! అలాంటిది ఏకంగా పదిసార్లు హిమాలయాలు ఎక్కిదిగేశాడు ఓ వ్యక్తి. ఆయన పేరు గోపాల్ వాసుదేవ్. పుణేకు చెందిన ఈ పర్వతారోహకుడు ఈ మధ్యే లిమ్కా రికార్డు పుస్తకాల్లోకీ ఎక్కేశాడు. హిమాలయాలు ఎక్కిదిగడం తనకు నీరు తాగినంత ఈజీ అని చెబుతున్నాడు. ‘‘మన దేశంలో గోపాల్ లాంటివారు చాలామందే ఉన్నారు. ఈయన గొప్ప ఏంటట..?’’ అని ప్రశ్నించారనుకోండి. ఆయన వయసు మీకు తెలుస్తుంది. అది తెలిశాక, ఆయన గొప్పదనమూ తెలుస్తుంది..!
అవును, 81 ఏళ్ల వయసులో నడవడమే కష్టమైన విషయం. అలాంటిది, ఏకంగా పర్వతాలు ఎక్కడమంటే మాటలు కాదు. కానీ, గోపాల్‌కు పర్వతారోహణే అత్యంత ఇష్టమైన పని. ఆటోమొబైల్ ఇంజినీర్‌గా 1964లో కెరీర్ ప్రారంభించాక, చాలా ఏళ్లు పుణేలోనే వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఆ సమయంలోనే పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. తొలిసారిగా 1972లో ట్రెక్కింగ్ చేశాడు. అప్పటి నుంచీ చిన్నాపెద్దా పర్వతాలను అధిరోహిస్తూనే ఉన్నాడు. ట్రెక్కింగ్ చేసేవాళ్లకు దేహ దారుఢ్యం చాలా అవసరమని ఆయన అభిప్రాయం. అందుకే, ఈ వయసులోనూ రోజుకు 8 కిలోమీటర్ల పాటు నడక సాగిస్తాడు. వారానికోసారి పుణే-ముంబై రహదారి సమీపంలోని చిన్నపాటి కొండను ఎక్కడం, దిగడం చేస్తుంటాడు.
మీ వయసు మాటేంటి..? అని ప్రశ్నించామనుకోండి. ‘‘నాకైతే 81 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పడం ఇష్టం ఉండదు. బదులుగా 81 ఇయర్స్ యంగ్ అని చెబుతాను’’ అంటాడీ పెద్దవయసు కుర్రాడు! స్వశక్తితోపైకి వచ్చిన ఈయన, పాతికేళ్ల క్రితమే సొంతంగా బిజినెస్ ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ వ్యాపారాన్ని తన కుమారులు చూసుకుంటున్నారు. అప్పుడప్పుడూ తానూ వెళ్లి స్వయంగా ప్లాంట్ పనితీరును గమనిస్తాడు గోపాల్. గతేడాది సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని 15,350 అడుగుల ఎత్తై రూపిన్ పాస్ని అధిరోహించిన సందర్భంగా లిమ్కాబుక్ వాళ్లు ‘పెద్ద వయసు’ పర్వతారోహకుడిగా ఆయన పేరుని చేర్చారు.
‘‘హిమాలయాలను ఒక్క రోజులో ఎక్కేయలేం. ఇదేమీ పరుగు పందెం కాదు కదా. నెమ్మదిగా లక్ష్యాన్ని పూర్తి చేయాలి. దీనికి ఫిట్నెస్ కూడా చాలా అవసరం. ఎత్తై పర్వతాలపై ఆక్సిజన్ అందదని చాలామంది చెప్పగా విన్నాను. కానీ, నాకెప్పుడూ శ్వాస సమస్యలు ఎదురవ్వలేదు. ఇంట్లో హాయిగా కూర్చునేవాళ్లు, ఏవేవో ఊహించుకుంటారు. వాటినే బయటకు చెబుతారు. కానీ, అవేవీ నిజం కాదు’’ అంటాడు గోపాల్. 80 ఏళ్లు పైబడినా రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు లాంటి సమస్యలు ఈయన దరిచేరలేదంటే నమ్మాల్సిందే!