ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి చర్యలు
అనంతపురం రూరల్:
నాణ్యమైన విద్యాబోధనతో ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు జిల్లా విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా ఆనందలహరి అభ్యసన (ఏఎల్ఏ) కార్యక్రమాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. అనంతపురం రూరల్ మండలంలోని ఎ.నారాయణపురం గ్రామ పంచాయతీ, సుఖదేవ్నగర్లో రివర్టైడ్ బోధనా పద్ధతిని ఆయన మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు.
మల్టీగ్రేడ్, మల్టీలెవల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఒకే తరగతి గదిలో వివిధ తరగతుల విద్యార్థులకు విద్యాబోధన ఉంటుందన్నారు. ప్రతిఒక్కరిపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దేందుగా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో దశల వారీగా ఏఎల్ఏ బోధనా పద్ధతులను అమలు చేయన్నుట్లు చెప్పారు.
ఎస్ఎస్ఏ పీఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... ఈ ఏడాది 1, 2తరగతుల విద్యార్థులకు డిజిటల్ విధానంలో బోధన ఉంటుందన్నారు. అనంతరం 3, 4, 5 తరగతుల విద్యార్థులకు విస్తరించనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమైన విద్యను అందించడం కోసం ఏఎల్ఎ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ చెన్నక్రిష్ణారెడ్డి, ఎస్ఎస్ఏ అధికారులు రవినాయక్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళీ, ఎంపీడీఓ ఓబులమ్మ, ఎంఈఓ వెంకటస్వామి, రిషివేలీ ఇన్స్టిట్యూట్ కో ఆర్డినేటర్స్ కళావతి, పూజ, ప్రతిమ పాల్గొన్నారు.