ముందస్తు హెచ్చరికల వ్యవస్థ
ఎన్పీఏలను ఎదుర్కొనడానికి ఎస్బీఐ వినూత్న చొరవ
కొత్త వ్యవస్థ ఆవిష్కరణ ప్రక్రియలో బ్యాంకింగ్ దిగ్గజం
న్యూఢిల్లీ : మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ సమస్యను ఎదుర్కొనడంపై ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దృష్టి సారిస్తోంది. ఒక అకౌంట్ మొండిబకాయిగా మారే పరిస్థితులను గుర్తించడం, తగిన చర్యలు తీసుకోవడం లక్ష్యంగా కొత్త వ్యవస్థ ఆవిష్కరణల ప్రక్రియలో బ్యాంక్ ఉన్నట్లు 2014-15 వార్షిక నివేదికలో బ్యాంక్ తెలియజేసింది. మొండిబకాయిగా ఒక అకౌంట్ మారుతున్న పరిస్థితుల్లో ముందస్తుగానే సంబంధిత హెచ్చరికల సంకేతాలను ఇవ్వడం ఈ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యమని బ్యాంక్ నివేదిక పేర్కొంది.
విభిన్న వ్యూహాలు...
మొండిబకాయిగా ఒక అకౌంట్ మారేముందుగానే పరిస్థితిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోడానికి విభిన్న వ్యూహాలను బ్యాంక్ అవలంభించనుంది. ముఖ్యమైనవి చూస్తే...
జీఈ క్యాపిటల్‌తో అవగాహన ద్వారా రిటైల్, రియల్టీ రంగాల్లో మొండిబకాయిలను కట్టడి చేసుకోవడం
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల విషయంలో మొండి బకాయిలు, రికవరీ తత్సబంధ సమస్యలను ఎస్బీఐ అసెట్స్ ట్రాకింగ్ సెంటర్స్ పర్యవేక్షిస్తాయి.
రికవరీలో భాగంగా స్ట్రెస్డ్ అసెట్స్ రిజల్యూషన్ బ్రాంచీల నుంచి రుణ గ్రహీతలకు/గ్యారెంటార్లకు టెలీ-కాలింగ్ ఏర్పాట్లు.
కాల్ సెంటర్లు, వెబ్-ఆధారిత పోర్టల్ వంటి వ్యవస్థల ద్వారా రుణ గ్రహీతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేలా తగిన సౌలభ్యతల ఏర్పాటు, సాంకేతిక అభివృద్ధి చర్యలు.
గత ఏడాది కొంచెం బెటర్... కాగా 2013-14తో పోల్చితే 2014-15లో బ్యాంక్ అసెట్ (రుణ) నాణ్యత కొంత మెరుగుపడినట్లు బ్యాంక్ నివేదిక వెల్లడించింది. నికర రుణాల్లో 2013-14లో మొండి బకాయిల వాటా 2.57 శాతం అయితే, 2014-15లో ఈ రేటు 2.12 శాతానికి తగ్గిందని నివేదిక తెలిపింది.
రుణాల వైపే కార్పొరేట్ల మొగ్గు
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు ఈక్విటీ రూపంలో కన్నా రుణాల రూపంలోనే నిధులు సమీకరించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే కంపెనీలు మార్కెట్ల నుంచి ఏకంగా రూ. 1.33 లక్షల కోట్లు సమీకరించాయి. ఇందులో సింహ భాగం.. దాదాపు రూ. 1.06 లక్షల కోట్లు డెట్ మార్కెట్ నుంచి రాగా, ఈక్విటీ మార్కెట్ల నుంచి వచ్చిన మొత్తం రూ. 27,032 కోట్లు మాత్రమే. ప్రధానంగా వ్యాపారాల విస్తరణ కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీలు ఈ నిధులను సమీకరించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశీ కంపెనీలు ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి రూ. 3.92 లక్షల కోట్లు సమీకరించగా.. గత ఆర్థిక సంవత్సరం ఈ మొత్తం రూ. 4.80 లక్షల కోట్లకు పెరిగింది.