కలగానే పోతార్లంక
తెనాలిరూరల్: వేలాది ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఆర్భాటంగా చేపట్టిన పోతార్లంక పథకానికి పురిట్లోనే సంధి కొట్టిన వైనం తెలిసిందే. పథకం నిర్మాణం పూర్తి చేసినా ట్రయల్ రన్‌లోనే పూర్తిగా విఫలమయివడంతో ఇక ఆ ఊసే ఎత్తలేదు నాటి పాలకులు.
కొల్లూరు, భట్టిప్రోలు మండలాలకు చెందిన దాదాపు 13 గ్రామాల పరిధిలోని ఐదువేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకానికి తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపుమార్చి ‘ఎత్తిపోతల’గా శంకుస్థాపన చేసినా అదీ శిలాఫలకానికే పరిమితమైంది. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకుండా లంక గ్రామాల రైతుల్ని, ప్రజలను చిన్నచూపు చూస్తున్న పాలకుల నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనైనా పథకం ఫలితాలనిస్తుందేమోనని లంక గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
నీటి పథకానికి కొరటాల ప్రతిపాదన..
1977 సంవత్సరంలో వచ్చిన ఉప్పెనతో కృష్ణానది పరీవాహక లంక గ్రామాల్లో తాగు, సాగునీటికి అవస్థలు మొదలయ్యాయి. 1978-83 మధ్య రేపల్లె ఎమ్మెల్యేగా వున్న సీపీఎం నేత కొరటాల సత్యనారాయణ నీటిపథకం అమలుకు ప్రతిపాదించారు. 1986 నుంచి రైతులు నీటి పథకం ఏర్పాటుపై అభ్యర్ధిస్తూ వచ్చారు.
దీనిపై అధ్యయనం చేసిన అప్పటి ప్రభుత్వ ఇంజినీరింగ్ సలహాదారు శ్రీరామకృష్ణయ్య రేపల్లె బ్యాంక్ కెనాల్ నుంచి కొల్లూరు నీటిని తీసుకుని లంక గ్రామాలకు తరలించడమే పరిష్కారమని భావించారు. ఇందుకు కొల్లూరు లాకుల్నుంచి పోతార్లంక వరకు ప్రధాన కాలువ, అక్కడ నుంచి కుడి, ఎడమ కాలువలు తవ్వితే లంక గ్రామాల్లోని 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకు రూ.1.06 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఎనిమిదేళ్లకు కదిలిన ఫైలు..
అప్పటి నుంచి దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం 1994 తర్వాత ఫైలులో కదలిక వచ్చింది. పోతార్లంక సాగునీటి పారుదల పథకం నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, 1995లో హెడ్ స్లూయిజ్ నిర్మాణం చేపట్టారు. 1997లో ఈ పథకాన్ని పూర్తిచేసే బాధ్యతను ‘ది కృష్ణ లంక నీటిపారుదల అభివృద్ధి సంఘం, జువ్వలపాలెం’ అధ్యక్షుడికి నామినేషను ప్రాతిపదికన ప్రభుత్వం అప్పగించింది. పథకం వ్యయం రూ.2.21 కోట్లుగా అంచనా వేశారు. రైతుల వాటా రూ.85 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో రూ.20 లక్షలు నగదుగా వసూలు చెల్లించారు. మిగిలిన డబ్బు రూ.65 లక్షలను జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రైతుల పొలాల దస్తావేజులు తనఖా పెట్టించి రుణాల పేరిట తీసుకున్నారు. 1997 డిసెంబర్ 3వ తేదీన శంకుస్థాపన చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఉప్పిరిసిన భూగర్భ జలాలతో పంట దిగుబడులు నష్టపోతున్న లంక గ్రామాల పరిధిలోని ఐదువేల ఎకరాల రైతులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. 1998లో ఎడమ కాలువ, 1999లో కుడి కాలువ నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి.
ట్రయల్ రన్ విఫలం...
కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని పోతార్లంక, తోకలవారిపాలెం, తురకపాలెం, తిప్పలకట్ట, కిష్కిందపాలెం, శివడరాంపురం, జువ్వలపాలెం, తడికలపూడి, గంటూరు గూడెం, కొత్త గూడెం, చింతమోటు, పెసర్లంకతో పాటు కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే ఆముదాలలంక గ్రామాల సాగునీటి అవసరాల కోసం ఉద్దేశించిన పోతార్లంక పథకం నిర్మాణం పూర్తి చేసుకున్నాక ట్రయల్ రన్‌లోనే ఘోరంగా విఫలమైంది.
ఎలాగోలా పథకాన్ని పూర్తి చేయించారే గాని నిర్మాణంలో పర్యవేక్షణ లేకపోవడంతో కొల్లూరు లాకుల దగ్గర నీరు విడుదల చేసినా చివరి వరకు అందక నిరుపయోగంగా మారింది. ఎలైన్మెంటు మార్పు చేసిన ఫలితంగా నీరు కాల్వకు ఎక్కనేలేదు. మరమ్మతుల పేరుతో నిలిచిపోయిన ఈ పథకాన్ని ఆ తర్వాత కాలంలో పట్టించుకున్న నాథుడు లేడు. కాలువల్లో పూడిక పేరుకుని పథకం ఆనవాళ్లు కోల్పోయింది. రైతుల వాటా డబ్బు, ప్రభుత్వం ఆర్ఐడీఎల్-2 కింద నాబార్డు నుంచి విడుదల చేయించిన మొత్తం, కాలువలో కొట్టుకుపోయాయి.
అంచనాలు మార్చినా శంకుస్థాపనతోనే సరి..
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేపల్లె ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని మల్లికార్జునరావు దీనిపై దృష్టి సారించారు. ఎత్తిపోతల పథకంగా మార్పు చేశారు. ఇటుక, ఇసుక ధరలు పెరిగిపోతుండటంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. చివరకు అంచనాలను సవరించి రూ.13.86 కోట్ల వ్యయంతో పథకం చేపట్టేందుకు నిర్ణయించారు. 2009 ఫిబ్రవరి 8వ తేదీ కిష్కింధపాలెం వద్ద శంకుస్థాపన చేశారు.
తర్వాత రెండు నెలల్లోనే ఎన్నికలొచ్చాయి. దీంతో ఈ పథకం శిలాఫలకానికే పరిమితమైంది. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన వరదలతో కాల్వలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం డెల్టా ఆధునికీకరణ పనులు జరుగుతున్న తరుణంలో పోతార్లంక పథకాన్ని పూర్తి చేస్తే తమకు మేలు కలుగుతుందని లంక గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. ఈసారైనా ప్రభుత్వం పథకం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.