రాజన్... గ్రేట్ : ప్రపంచ బ్యాంక్ చీఫ్
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లలో రాజన్ గొప్ప వ్యక్తి అని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ చెప్పారు. ఎటువంటి ఒత్తిడులూ లేకుండా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ స్వతంత్రంగా పనిచేస్తారని, ఇదే విధానం మున్ముందు కూడా కొనసాగుతుందని భారత్ నాయకత్వం తనకు తెలిపిందని చెప్పారాయన. గురువారమిక్కడ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజన్ విజ్ఞానాన్ని తాను ఎంతగానో గౌరవిస్తానన్నారు.
జీడీపీ నంబర్లు ఓకే..!
భారత్ స్థూల దేశీయోత్పత్తి నంబర్లను మీరు విశ్వసిస్తారా అన్న ప్రశ్నకు కిమ్ సమాధానం చెబుతూ, ‘‘ఇది (జీడీపీ అంకెల గణాంకాల విధానం) ఖచ్చితమైన శాస్త్రం కాదు. ఇక్కడ ఫిజిక్స్ ఏమీ ఉండదు. వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించి సమన్వయంతో తగిన నిర్ధారణకు రావడం జరుగుతుంది. కాలం, పరిస్థితులకు అనుగుణంగానే ఇవి ఉంటాయి. ఈ అంకెలు తగిన విధంగా ఉన్నాయనే భావిస్తున్నాం’’ అని అన్నారు. అయినా ఇలాంటి సందేహాలు కొత్తేమీ కాదనీ, చైనా వృద్ధి గణాంకాల విషయంలోనూ ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయన్నారు. అయితే చర్చలను ఎప్పుడూ ప్రపంచబ్యాంక్ స్వాగతిస్తుందని కూడా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.6%కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.9 శాతం నమోదయింది.