గ్రీస్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు రేసులో జీఎంఆర్
• ప్రాజెక్టు విలువ సుమారు
• 850 మిలియన్ యూరోలు
• గ్రీస్ సంస్థతో కలసి బిడ్డింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ తాజాగా గ్రీస్‌లోని క్రీట్లో కొత్త విమానాశ్రయ ప్రాజెక్టు దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. గ్రీస్‌కు చెందిన జీఈకే టెర్నా సంస్థతో కలసి కన్సార్షియంగా ఏర్పడి బిడ్ వేసినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. గ్రీస్ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం ప్రాజెక్టు విలువ సుమారు 850 మిలియన్ యూరోలని (దాదాపు రూ. 6,120 కోట్లు) వివరించింది. కాంట్రాక్టు కింద క్రీట్లోని హెరాక్లియోన్ నగరంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయ డిజైన్, అభివృద్ధి, నిర్వహణ, తత్సంబంధిత రహదారుల ఏర్పాటు మొదలైన అంశాలు ఉంటాయి. ఒప్పందం 35 ఏళ్ల పాటు ఉంటుంది. దీనికి దాఖలైన ఏకైక బిడ్ తమదేనని భావిస్తున్నట్లు జీఎంఆర్ తెలిపింది. ప్రాజెక్టు దక్కిన పక్షంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సంస్థ విమానాశ్రయ ఆపరేటరుగా ఉంటుంది.
ఏటా 2.4 కోట్ల మంది టూరిస్టులు గ్రీస్‌ను సందర్శిస్తారని అంచనా. గ్రీస్‌లోనే అతి పెద్ద దీవి అయిన క్రీట్‌ను సందర్శించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ఇక్కడి హెరాక్లియోన్ విమానాశ్రయం గ్రీస్‌లో రెండో పెద్ద ఎయిర్‌పోర్టు. అయితే, సామర్థ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నందున ప్రభుత్వం మరో విమానాశ్రయాన్ని తలపెట్టింది. కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత విమానాశ్రయాన్ని మూసివేయనున్నారని జీఎంఆర్ వర్గాలు తెలిపాయి.
జీఎంఆర్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. ఇటీవలే గోవాలోని మోపా ఎయిరోడ్రోమ్ అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టు దక్కించుకుంది. అఉట మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో కలసి ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, గ్రీస్‌లోని రెండు దిగ్గజ నిర్మాణ కంపెనీలైన జీఈకే, టెర్నాల విలీనంతో జీఈకే టెర్నా గ్రూప్ ఏర్పడింది. నిర్మాణం, ఇంధన ఉత్పత్తి, మైనింగ్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి.