greengram
-
పిసరంత.. పెసర
రైతన్నను ముంచిన ఎపీ సీడ్స్ పైరు పెరిగినా..పంట పోయింది జిల్లా వ్యాప్తంగా 719.8 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా 3,550 మంది రైతులు 15 వేల ఎకరాల్లో సాగు రూ.12 కోట్లు నేలపాలు కావలి : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సరఫరా చేసిన పెసర విత్తనాలు రైతులకు తీరని నష్టాలను మిగిల్చాయి. జిల్లా వ్యవసాయశాఖ రికార్డుల్లో రాసుకున్న లెక్కల ప్రకారం 6 వేల ఎకరాల్లో ప్రస్తుతం పెసర సాగు చేస్తున్నారు. కానీ వాస్తవంగా జిల్లాలో 15 వేల ఎకరాల్లో రైతులు పెసర సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉందని, సాగుకు నీరు ఇవ్వలేమని.. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు ప్రభుత్వం సెలవిచ్చింది. ఆరుతడి పంటలు సాగు చేసుకునే రైతులకు ఏపీ సీడ్స్ ద్వారా నాణ్యమైన పెసర విత్తనాలు ఇస్తామని కూడా ఘనంగా చెప్పుకుంది. నాణ్యత విషయంలో ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు, పొలం కాగితాలు చేతబట్టుకొని వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగి విత్తనాలు కొనుగోలు చేశారు. కేజీ రూ. 60 చొప్పున 4 కేజీల విత్తనాల సంచిని రూ.240లకు కొనుగోలు చేశారు. వ్యవసాయశాఖ ద్వారా ఏపీ సీడ్స్ పెసర విత్తనాలు 719.8 క్వింటాళ్లు జిల్లాలోని 3,550 మంది రైతులకు అమ్మారు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని పెసర సాగు చేసుకొన్న రైతులు నేడు నట్టేట మునిగారు. ఏపీ సీడ్స్ పెసర విత్తనాలు సక్రమంగా మొలకెత్తకుండా, మొలకెత్తినా ఎదుగుదల లేకుండా, ఎదిగినా కాయలు కాయకుండా.. ఇలా పలురకాలుగా ఇబ్బందులు ఎదురయ్యాయి. పైరుపై మమకారంతో రైతులు రెక్కల కష్టంతో పాటు అప్పులు చేసి మందులు పిచికారి చేసినా పైరు సక్రమంగా రాలేదు. ఇక లాభం లేదనుకొని రైతులు పెసర పైరుపై ఆశలు వదులుకుంటున్నారు. తాము నిండా మునిగిపోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ గోడు ఆలకించి తగు సహాయం చేయాలని కోరుతున్నారు. పొలాలను పరిశీలిస్తాం జిల్లాలో ఏపీసీడ్స్ పెసర విత్తనాల ద్వారా సాగుచేసిన రైతుల పొలాల వద్దకు శాస్త్రవేత్తల ను పంపుతాం. నేను కూడా పరిశీలిస్తున్నా. నివేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తదుపరి వచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. కె.హేమమహేశ్వరరావు,జాయింట్ డైరెక్టర్ జిల్లా వ్యవసాయశాఖ, నెల్లూరు ‘కౌలుకు 30 ఎకరాలు తీసుకొని వరిపైరు కోసం నార్లు పోశా. నీళ్లు లేక ఎండిపోయింది. వ్యవసాయ శాఖ ద్వారా నాణ్యమైన పెసర విత్తనాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించే సరికి దానిని సాగు చేయాలని నిర్ణయించుకున్నా. ఏపీ సీడ్స్ పెసర విత్తనాలు కొనుగోలు చేసి సాగుకు దిగాను. పైరు ఎదుగులలో తేడా కనిపించడంతో అందిన కాడికి అప్పులు చేసి చాలా రకాల మందులు పిచికారీ చేశా. పైరు ఎదిగిందే కాని కాయలు లేవు. కాయలు కాసే అదను దాటిపోయింది. పైరు ఎండు ముఖం పట్టింది. వ్యవసాయ అధికారులకు చెబితే వచ్చి చూసి పైరు ఎండిపోయిందన్నారు. రూ.2.80 లక్షల అప్పుల పాలయ్యాను.’ – ఇది కావలి మండలంలోని గౌరవరంలో పెసర సాగు చేసిన వాకా శ్రీనివాసులు రెడ్డి అనే రైతు మనో వ్యథ. -
కందుల కొనుగోలుకు 8 కేంద్రాలు
- ఎంఎస్పీ, బోనస్ కలిపి రూ.5050 మద్దతు ధర కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు 8 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం సాక్షిలో కందులు..ఆశలు తలకిందులు శీర్షికతో ప్రచురించిన కథనానికి జేసీ స్పందించారు. వెంటనే మార్క్ఫెడ్ అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. మార్కెట్లో కందుల ధర పడిపోవడంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్పీ, బోనస్ కలిపి రూ.5050 కొనుగోలు చేస్తామని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు, బనగానిపల్లె, ఆత్మకూరు, నంద్యాల మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇతర వ్యర్థ పదార్థాలు 2 శాతం, ఇతర వ్యర్థ పంటల గింజలు 1 శాతం, దెబ్బతిన్న గింజలు 3, పగిలిన, విరిగిన గింజలు 3 శాతం, పురుగు పట్టిన గింజలు 3 శాతం, పూర్తిగా తయారుకాని గింజలు 3 శాతం, తేమ 12శాతం వరకు ఉండాలని వివరించారు. మరిన్ని వివరాలకు ఫోన్(08518–229110)లో సంప్రదించాలన్నారు. -
బయటపడిన వ్యాపారుల సిండికేట్
నెలకు పైగా రైతులను మోసం చేసిన వైనం క్వింటాకు సగటున రూ.1,000 నష్టపోయిన రైతులు ప్రభుత్వ కొనుగోలుతో సమాంతర ధర పెడుతున్న వ్యాపారులు ఖమ్మం వ్యవసాయం : ప్రభుత్వం పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడటంతో వ్యాపారుల అసలు రంగు బయటపడింది. పంట ఉత్పత్తికి డిమాండ్ ఉన్నా వ్యాపారులు కనీస మద్దతు ధర పెట్టకుండా తక్కువ ధరకు సరుకు కొనుగోలు చేశారు. మద్దతు ధర కన్నా వ్యాపారులు రూ.1,000 పైగా తక్కువ ధరకు సరుకును కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వం పెసల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వారం కిందట నాఫెడ్ నిధులతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 5,962 హెక్టార్లు కాగా 27,310 హెక్టార్లలో, కంది సాధారణ సాగు విస్తీర్ణం 2,964 హెక్టార్లు కాగా, 9,420 హెక్టార్లలో పంటలను వేశారు. పెసర సాగు విస్తీర్ణం జిల్లాలో నాలుగున్నర రెట్లు పెరిగింది. ఆగస్టు రెండోవారం నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెసల కొనుగోలు మొదలైంది. తీవ్రంగా నష్టపోయిన రైతులు కొత్త పెసల కొనుగోళ్లు మొదలైన సమయంలో రూ.7 వేలకు పైగా ఉన్న పెసల ధర ఒక్కసారిగా కుప్పకూలింది. నాణ్యత పేరిట రూ.4 వేల నుంచి రూ.4,500కు కొనుగోళ్లు చేయటం ఆరంభించారు. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు వరంగల్, నల్లగొండల్లో కూడా పంట సాగు ఎక్కువగా ఉండి పంట ఉత్పత్తి అధికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు విక్రయానికి వస్తుండటంతో వ్యాపారులు సిండికేటై అమాంతం ధరను తగ్గించారు. సరుకు నాణ్యతను బట్టి రూ. 3,500 నుంచి రూ.4,400 వరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.5,225 కాగా రూ.వెయ్యికి తక్కువ ధరకు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యాపారులు సిండికేటై రైతులను నిలువునా దోచుకున్నారు. వ్యవసాయ మార్కెట్లలోనే గాక గ్రామాల్లో కూడా వ్యాపారులు తక్కువ ధరలకు పంట ఉత్పత్తిని కొనుగోలు చేశారు. 1,400 క్వింటాళ్లు కొనుగోలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏడాది కొత్త పెసల సీజన్ ఆరంభం నుంచి ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు వరకు సుమారు 1,400 క్వింటాళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. దీనిని పరిగణలోకి తీసుకుంటే రూ.14 లక్షల మేర రైతులు నష్టపోయి ఉంటారని అంచనా. కాగా, ప్రభుత్వ పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో వ్యాపారులు ధర పెంచారు. క్వింటా పెసలను రూ.4,800 నుంచి రూ.5,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యాపారుల అసలు రంగు బయటపడింది. కొనుగోలు కేంద్రంతోనే పోటీ ధర: వనకంచి పెదవెంకయ్య రైతు, మంచుకొండ ప్రభుత్వం పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడటంతోనే వ్యాపారులు ధర పెంచారు. లేదంటే క్వింటా పెసలను రూ.4 వేలకు మించి కొనుగోలు చేయలేదు. డబ్బు అవసరం ఉండి వ్యాపారులకు రూ.4,800 విక్రయించా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా గొల్లపూడి నాగేశ్వరరావు, రైతు, తాళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం ధర తక్కువగా ఉండటంతో సరుకును అమ్మలేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి క్వింటాకు రూ.5,225 ధర కల్పించటంతో ఆ ధరకు విక్రయించా. వ్యాపారులు క్వింటాకు రూ.4,000కు మించి అడగ లేదు. కొనుగోలు కేంద్రంతో మద్దతు ధర వచ్చింది.