యువకుడి దారుణహత్య
మర్మాంగం కోసివేత
గోనె సంచిలో మృతదేహం
వివాహేతర సంబంధమే కారణం
నిందితులిద్దరూ భార్యాభర్తలు
మూడు రోజుల తర్వాత అరెస్ట్
కృష్ణరాజపురం: వివాహేతర సంబంధం కొనసాగించాలని బలవంతం చేసిన యువకుడి మర్మాంగం కోసి, హత్యచేసిన దంపతుల ఉదంతమిది. ఈ కేసులో నిందితులైన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. హతుడు, హంతకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లమాడ మండలం గూడమేకలపల్లికి చెందిన కళ్యాణి, నరసింహులు దంపతులు. కూలి పనుల కోసం కొద్దిరోజుల కిందట బెంగళూరులోని మహదేవపురకు వెళ్లారు. వీరి గ్రామానికి చెందిన చంద్ర అనే యువకుడు అప్పుడప్పుడు నరసింహులు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో కళ్యాణితో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి నరసింహులు తన భార్యను మందలించాడు.
అయితే భర్త మాటలను పెడచెవిన పెట్టడంతో కళ్యాణికి మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ఇకపై వివాహేతర సంబంధం కొనసాగించడం కుదరంటూ చంద్రకు కళ్యాణి తెగేసి చెప్పింది. ఇదివరకటిలా ఉండకపోతే అందరికీ చెబుతానంటూ చంద్ర బెదిరించాడు. దీంతో కళ్యాణి దంపతులు ఇతడిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. బుధవారం రాత్రి మాట్లాడాలంటూ చంద్రను నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి అతడి మర్మాంగం కత్తిరించి, హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి, అక్కడే పడేసి వెళ్లిపోయారు. చంద్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహదేవపుర పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన నరసింహులు, కళ్యాణిలను శనివారం అరెస్ట్ చేశారు.