అక్రమ కేసులకు అదరం... బెదరం
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం
రైతులను దెబ్బతీసే అధికార పార్టీ నేతలే టార్గెట్
అక్రమ కేసులకు భయపడేది లేదు
ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ నేతల హెచ్చరిక
విజయవాడ : ప్రజాందోళనలకు అండగా నిలబడటంతో పాటు రైతుల పక్షాన బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని)పై పోలీసు కేసుల నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు రెండు రోజులుగా సమావేశమై చర్చించారు. బుధ, గురు వారాల్లో కృష్ణా జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలో పర్యటించారు. పేర్ని నానిని పరామర్శించారు. ఉద్యమానికి భరోసా ఇచ్చారు.
అణచివేస్తే తిరుగుబాటు తప్పదు..
అణచివేత చర్యల ద్వారా పాలన ఎంతోకాలం సాగించలేరని, ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటుకు వారే కారణమవుతారని నాయకులు హెచ్చరించారు. గురువారం మంత్రి కొల్లు రవీంద్ర బందరులోని ఆర్అండ్బీ బంగళాలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి భూ సేకరణ నుంచి బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం గ్రామాలను మినహాయించనున్నట్లు చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులో ఆంతర్యమేమిటని నేతలుప్రశ్నించారు.
గ్రామాల మధ్య చిచ్చు..
గ్రామాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మంత్రి కొల్లు వ్యవహార శైలి ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. పోర్టుకు 4800 ఎకరాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని రైతులు చెబుతున్నారని, పరిశ్రమల పేరుతో 30 వేల ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పోరాటం చేయటాన్ని ఎవ్వరూ ఆపలేరనేది రైతుల పక్షాన వైఎస్సార్సీపీ నాయకులు ప్రకటించారు.
కక్ష సాధింపు చర్యలు..
రైతుల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపునకు పాల్పడుతుంటే, చట్టాన్ని రక్షించాల్సిన అధికారులు వారికి వంతపాడుతున్నారని ఆరోపిస్తుంచారు. కలెక్టర్ కూడా భూ సేకరణ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా మంత్రి మాటలకు విలువిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
వర్షాలతో తీవ్ర నష్టం..
జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, తెగిపోయిన రోడ్లు, చెరువులకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని పార్టీ ఇన్చార్జి రామచంద్రారెడ్డి కోరారు. ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి వివరించాలని నిర్ణయించారు. పలు ప్రాంతాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రామచంద్రారెడ్డి దృష్టికి పలువురు నాయకులు తీసుకొచ్చారు.