ఒక్క ఫుట్‌బాల్... ఆ ఊరినే మార్చేసింది!
ప్రపంచమంతా ఫుట్‌బాల్ మానియాతో ఊగిపోతున్న ఈ సమయంలో, ‘ఫుట్‌బాల్’ ఆటతో అభివృద్ధి చెంది పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘రుక్ర కలన్’ ఊరి గురించి చెప్పుకోవడం సందర్భోచితమే కాదు స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది.
పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఉంది ఈ గ్రామం. చిన్న ఊరే అయినా ఊరి చరిత్రకు మాత్రం పెద్ద పేరు ఉంది. ‘గదర్ ఉద్యమం’లో ఈ ఊరి నుంచి 22 మంది స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు. ఇక ఫుట్‌బాల్ విషయానికి వస్తే ఈ ఊరు ‘ట్రెండ్ సెట్టర్’గా గుర్తింపు పొందింది. ఈ ఊరి నుంచి అయిదుగురి వరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలలో ఆడారు. జాతీయస్థాయిలో నైతే వందల మంది ఆడారు.
ఆట ఆట కోసమేనా? ఆటను ఊరు బాగా కోసం ఉపయోగించుకోలేమా? అని ఆలోచించారు గ్రామస్థులు. తమ ప్రియమైన ఆటను ఊరి సంక్షేమం కోసం వినియోగించాలనుకున్నారు. అలా ఊళ్లో ఫుట్‌బాల్ క్లబ్ కొత్తగా ఏర్పడింది. ఈ క్లబ్ దేశవ్యాప్తంగా రకరకాల ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో పాల్గొని గెలుచుకున్న బహుమతి మొత్తాన్ని, భవన నిర్మాణం, విద్య, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. దీనికి దాతల సహాయం కూడా తోడైంది.
ఆటతో పాటు పాటను కూడా నమ్ముకుంది ఫుట్‌బాల్ క్లబ్. జిల్లాలో ఉత్సవాలు జరిగినప్పుడు భాంగ్రా నృత్య ప్రదర్శన ఇచ్చి ఆ మొత్తాన్ని కూడా ‘విలేజ్ డెవలప్మెంట్ ఫండ్’కు జత చేసేవారు. గురుద్వారాల దగ్గర సైకిల్‌స్టాండ్ నిర్వహించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా ఊరి అభివృద్ధికి ఖర్చు చేసేవారు. దీనికి ఊరి పెద్ద రైతులు, ఎన్ఆర్ఐలు తమ వంతు సహాయం అందించడం ప్రారంభించారు.
‘‘మన ఊరికి ఒక మంచి ఫుట్‌బాల్ మైదానం ఉంటే బాగుంటుంది’’ అని క్లబ్ సభ్యులు అడగగానే ఊరి చివర ఉన్న ఖాళీ స్థలంలో రైతులందరూ కలిసి 300 ట్రాలీల మట్టిని పోశారు. ఫీల్డ్ తయారు చేయడానికి ఆబాలగోపాలం చెమట చిందించింది. మట్టి మీద పచ్చటి గడ్డిని మొలిపించారు. అండర్‌గ్రౌండ్ ఇరిగేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అలా బ్రహ్మాండమైన ఫుట్బాల్ఫీల్డ్ తయారైంది. ఊళ్లో వాళ్లకు ఏ సమస్య వచ్చినా ‘‘మేమున్నాం’’ అంటూ క్లబ్లో ఉన్న 40 మంది సభ్యులు ముందుకు వస్తారు.
సంక్షేమ కార్యక్రమాలు...
యాభై లక్షల వ్యయంతో గ్రామంలో ‘యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్’ నిర్మించారు. ఇలాంటి కేంద్రం జిల్లాలోనే ఎక్కడా లేదు. ఇందులో కంప్యూటర్ లేబరేటరి, స్టడీ రూమ్‌లు, మల్టీ యాక్టివ్ రూమ్‌లు ఉన్నాయి. ఎల్సిడి ప్రాజెక్టర్, థియేటర్ సిస్టమ్, బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో పాటు ఒక ఎన్ఆర్ఐ సహకారంతో అల్ట్రా మోడ్రన్ హెల్త్ క్లబ్‌ను కూడా నిర్మించారు. దీనిలో కెరీర్ కౌన్సెలింగ్, గైడ్లైన్ సెంటర్‌తో పాటు చిన్న గ్రంథాలయం కూడా ఉంది. ఊరి ప్రజలకు ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని పరిచయం చేస్తుంది ఈ కేంద్రం. ఇక సెమినార్ హాల్లో గ్రామ అభివృద్ధి గురించి రకరకాల చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. దేశం నలుమూలల్లో తమ తమ ఊరి అభివృద్ధికి పాటు పడిన వారి ఉపన్యాసాలు ఉంటాయి. పేద విద్యార్థుల కోసం క్లబ్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ కేంద్రం, బ్యూటీషియన్ ట్రైనింగ్ సెంటర్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్లు నడుస్తున్నాయి. శిక్షణ తీసుకునేవారికి ఉపకారవేతనం కూడా ఇస్తారు.
ఆయన వల్లే...
ఊరి వారందరిని ఏకతాటిపై నడిపించిన ఘనత గురుమంగళ్ దాస్ సోనికి దక్కుతుంది. అమెరికాలోని ‘యూనివర్శిటీ ఆఫ్ నెవద రెనో’లో ఇంజనీరింగ్ చదువుకున్న దాస్‌కు ఊరంటే ఎంతో ప్రేమ. అయితే చాలామందిలా ఆ ప్రేమ మాటలకే పరిమితం కాలేదు. ఊరి వాళ్లకు ఫుట్‌బాల్ ఆట అంటే వ్యామోహం అనే విషయం అతనికి తెలుసు. అందుకే- ‘ఆటతో అభివృద్ధి’ అనే నినాదంతో రంగంలోకి దిగాడు.
గ్రామంలోని తన ఇంట్లో పుట్‌బాల్ దిగ్గజాలుగా పేరున్న స్థానిక ఆటగాళ్లతో సమావేశం నిర్వహించాడు. వారి నుంచి సూచనలు తీసుకున్నాడు. గ్రామ యువకులకు ఫుట్‌బాల్‌లను ఉచితంగా పంచిపెట్టాడు. యూరప్‌లోని వివిధ దేశాలకు వెళ్లి అక్కడి స్వచ్ఛందసంస్థలు, ఫుట్బాల్క్లబ్లతో మాట్లాడి నిధుల సమీకరణ చేశాడు. ఏదో ఒకరోజు ఫుట్‌బాల్ ఆటలో తమ ఊరు అంతర్జాతీయ స్థాయికి వెళుతుందనేది దాస్ కల. ఆయన కల నెరవేరే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది!
ఒక పద్ధతి ప్రకారం, శాస్త్రీయంగా పిల్లలకు శిక్షణ ఇస్తే ఫుట్‌బాల్ ఆటలో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. ఏదో ఒక రోజు అంతర్జాతీయ స్థాయిలో మా ఊరి ఆటగాళ్ల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు.
- గురుమంగళదాస్