ఫేస్బుక్ లవ్: అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి
కులం, మతం, జాతి, ప్రాంతం, దేశం.. వీటిన్నిటికీ ప్రేమ అతీతమైనదని చెబుతారు. ఇంటర్నెట్ రాకతో ప్రపంచం ఓ కుగ్రామమైంది. ఇక సోషల్ మీడియా వల్ల ముక్కు మొహం తెలియని వారు స్నేహితులుగా, ప్రేమికులుగా మారుతున్నారు. ఫేస్బుక్లో పరిచయమైన రెండు దేశాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమికులుగా మారారు. ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
రాజస్థాన్‌లోని బికనీర్ నగరానికి చెందిన పృథ్వీకి, హాంకాంగ్‌కు చెందిన హెయిలీ అనే అమ్మాయి ఆరేళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్ చేస్తూ ఒకర్నొకరు ప్రేమించుకున్నారు. తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని ఇద్దరూ భావించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముంది హెయిలీ గతవారం తన తల్లితో కలసి హాంకాంగ్ నుంచి బికనీర్‌కు రావడం.. గత బుధవారం కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పృథ్వీని వివాహం చేసుకోవడంతో ఆరేళ్ల ప్రేమకథ సుఖాంతమైంది.