వివాదంలో హన్సిక
దర్శక నిర్మాతల నటిగా పేరు తెచ్చుకున్న హన్సిక వివాదాలకు దూరంగా ఉంటారంటారు. అలాంటిది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక వివాదంలో చిక్కుకున్నారు. హన్సికకు ఇటీవల కోలీవుడ్లో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇటీవల తను నటించిన పులి, పోకిరిరాజా చిత్రాలు వరుసగా అపజయాల పాలవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం హన్సిక జయంరవికి జంటగా బోగన్ అనే ఒక్క చిత్రం మాత్రమే చేస్తున్నారు. పోకిరిరాజా చిత్ర నిర్మాత ఈమె మీద కేసు వేయడానికి సిద్ధం అవుతున్నారు. వివరాల్లోకెళితే బందా పరమశివం, ఒంబదుల గురు చిత్రాల దర్శక నిర్మాత, పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన పీటీ.సెల్లకుమార్ ఆ మధ్య జీవా, హన్సిక జంటగా పోకిరిరాజా అనే చిత్రాన్ని నిర్మించారు.
ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోవైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి హన్సిక పాల్గొననున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె ఆ కార్యక్రమానికి హాజరవలేదు. దీంతో నిర్మాత పీటీ.సెల్వకుమార్ హన్సిక కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించమని ఆమెను అడిగారు. నిర్మాత మండలిలోనూ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ హన్సిక ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో నిర్మాత ఆమెపై కేసు పెట్టడానికి సిద్ధం అయ్యారు.
దీని గురించి పీటీ.సెల్లకుమార్ తెలుపుతూ పోకిరిరాజా చిత్రంలో నటించినందుకుగానూ హన్సికకు ఒప్పందం ప్రకారం పారితోషికం పూర్తిగా చెల్లించానని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోవైలో నిర్వహించ తలపెట్టామన్నారు. అందులో హన్సిక పాల్గొనడానికి ఆమెకు అలంకార దుస్తులు, బస వసతులు, ప్రయాణ వసతుల కొరకు లక్షల్లో ఖర్చు చేశామన్నారు. అలాంటిది హన్సిక చివరి వరకూ వస్తానని చెప్పి రాలేదని ఆరోపించారు. ఈ వ్యవహారం గురించి నిర్మాత మండలి ద్వారా మాట్లాడించినా ఆమె నుంచి సరైన సమాధానం రాలేదని, డబ్బు తిరిగి చెల్లించలేదని చెప్పారు. పైగా తనను అవమానించే విధంగా మాట్లాడారని తెలిపారు. నటి హన్సికపై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.