బిజినెస్ రూల్స్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు
పాల్వాయి ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి
హరీబాయి చౌదరి సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానికి సంబంధించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా బిజినెస్ రూల్స్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీబాయి చౌదరి సభకు లిఖితపూర్వక సమాధానం అందజేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పాలనా సౌలభ్యం కోసం ప్రజల ప్రాణ, ఆస్తుల సంరక్షణపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి.
అయితే తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ ట్రాన్సాక్షన్ రూల్స్(బీటీఆర్)ను మార్చేందుకు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం జూన్ 4న బీటీఆర్ మార్చడంపై అభిప్రాయాన్ని కోరగా జూలై 5న తెలంగాణ ప్రభుత్వం బదులిచ్చింది. శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రివర్గం ద్వారా గవర్నర్‌కు నివేదికలు పంపిస్తామని ఆ లేఖలో పేర్కొంది. సంబంధిత నేరాలను గమనించేందుకు డీజీపీ కార్యాలయంలో ఒక అధికారిని నియమిస్తామంది. అలాగే ఉమ్మడి రాజధాని ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో భాగమని, ఇక్కడ ఉమ్మడి శాంతిభద్రతల బలగాలు ఉండబోవని తెలిపింది. శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలో అంశమైనందున.. ఇతర రాష్ట్రాలకు చెందిన బలగాలు తమ రాష్ట్ర పరిధిలో ఉండజాలవని తెలంగాణ పేర్కొంది.’ అని వివరించారు.