జాబ్ మానేశాడు.. కోటీశ్వరుడయ్యాడు!
జైసల్మేర్: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటే కావాలంటూ లక్షల మంది పరుగులు పెడతారు. కానీ, ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఉద్యోగంలో తనకు సంతృప్తి లేదని భావించిన రాజస్థాన్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం ఏడాదికి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి...
హరీష్ ధండేవ్ రాజస్థాన్ లో ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన తండ్రి వ్యవసాయదారుడు. రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కావడంతో ఉద్యోగంతో సంతృప్తి చెందక జాబ్ మానేశాడు. ఓసారి ఢిల్లీకి వెళ్లిన అతడు అక్కడ ఎన్నో విషయాలు చూశానని, అదే తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటున్నాడు. ప్రస్తుతం అతడు తన 120 ఎకరాల పొలంలో అలోవెరా పండిస్తున్నాడు. అలాగని కాస్తా కూస్తో సంపాదిస్తున్నాడనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఎందుకుంటే హరీష్ వార్షిక ఆదాయం రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్లు. నాటురెలో అగ్రో అనే కంపెనీని స్థాపించాడు.
అలోవేరా పండించి పతంజలి ఫుడ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థకు సరఫరా చేస్తున్నాడు. ఆ కంపెనీ వారు అలోవేరా జ్యూస్ తయారీ కోసం హరీష్ నుంచి సరుకు కొనుగోలు చేస్తుంది. తన పంటకుగానూ కోట్ల రూపాయలు ఆర్జించడంతో పాటు మరెందరికో ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. థార్ ఎడారి ప్రాంతంలో వీటి ఉత్పత్తి అధికంగా ఉంటుంది. తన స్వస్థలం, వ్యవసాయక్షేత్రం ఆ సమీప ప్రాంతాల్లోనే ఉండటం కూడా హరీష్ కు కలిసొచ్చింది. అలోవెరాకు దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ భారీగా డిమాండ్ ఉంటుంది.