చానల్ చూడనివ్వలేదని యువతి ఆత్మహత్య
కృష్ణగిరి (తమిళనాడు), న్యూస్‌లైన్: ఇష్టమైన చానల్‌ను చూడనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆర్ఎస్ లక్షీ్ష్మపురం ప్రాంతానికి చెందిన వ్యాపారి మురుగేశన్, నాగలక్ష్మి(టీచర్) దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు నివేద (20) స్థానిక కళాశాలలో బీఏ రెండో సంవత్సరం, మరో కూతురు హరిత్ ఇంటర్మీడియెట్ చదువుతోంది. తల్లిదండ్రులు విధులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఆలస్యమయ్యేది.
వారు వచ్చేంతవరకూ అక్కాచెల్లెళ్లు ఇంట్లో టీవీ చూసేవారు. ఇష్టమైన చానల్ కోసం వారు గొడవపడేవారు. ఎప్పట్లాగే మంగళవారం సాయంత్రం అక్కాచెల్లెళ్లు ఇంట్లో టీవీ చూస్తుండగా, ఇష్టమైన చానల్ కోసం పోట్లాడుకున్నారు. ఆవేశంతో నివేద తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన నాగలక్ష్మి తన కుమార్తెను సముదాయించేందుకు ఎంతసేపు పిలిచినా ఆమె తలుపు తీయకపోవడంతో కిటికీ తీసి చూశారు. నివేద గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపిం చింది. తలుపులు బద్దలుగొట్టి లోపలకెళ్లి ఆమెను కిందకు దించారు. అప్పటికే నివేద ప్రాణాలు కోల్పోయింది.