హైసియా టెక్‌ఫెస్ట్‌లో రికార్డులు బ్రేక్ చేసిన మేజ్
రికార్డులు బ్రేక్ చేసిన మేజ్, హార్లీ డేవిడ్సన్- మేడిన్ ఇండియా, వీల్‌చెయిర్ ను కంట్రోల్ చేసే స్మార్ట్ ఫోన్.. ఇలా ఇన్నోవేటివ్ థాట్స్‌కు వస్తు రూపమిచ్చారు యువ టెకీలు. ప్రోత్సాహం ఉండాలే కానీ.. సృజనకు కొదవ లేదని నిరూపించారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రెజైస్ అసోసియేషన్ (హైసియా) ఇటీవల నిర్వహించిన టెక్‌ఫెస్ట్‌లో ఆకట్టుకున్న కొన్ని ఆవిష్కరణల గురించి...
- ఎస్.శ్రావణ్‌జయ
పిల్లలు ఆడుకునే ‘మేజ్’ గుర్తుందా? గజిబిజి గీతలతో కన్ఫ్యూజ్ చేసి.. దారి కనుక్కోమని సవాల్ విసిరే గేమ్. ‘ఓ అదా.. చాలా ఈజీ’ అని భుజాలెగరేయకండి! ఆ మేజ్ అర పేజీలోనో, ఒక పేజీలోనో ఉంటే.. ఈజీగా కనిపెట్టేయొచ్చు. 300 అడుగులున్న మేజ్లో దారి కనిపెట్టడమంటే పద్మవ్యూహంలోకి అడుగు పెట్టడమే. యువ ఇంజనీర్లు లాస్య, ఝాన్సీ ఈ మేజ్‌ను రూపొందించారు. ఇండియాలోనే అతి పెద్ద‘మేజ్ గేమ్’ను తయారు చేసిన ఈ టెక్ ద్వయం.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌తో పాటు గిన్నిస్ రికార్డు కోసం కూడా ట్రై చేస్తామని చెబుతున్నారు.
హార్లీ డేవిడ్సన్ మేడ్ బై ఇండియన్
హార్లీ డేవిడ్సన్.. అమెరికాలో తయారయ్యే ఈ బైక్స్‌కి మనదగ్గర ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బేసిక్ వర్షన్ హార్లీని తీసుకుని, దానికి అత్యాధునిక హంగులు జోడించి ‘ఔరా!’ అనిపించేలా డిజైన్ చేశాడు రైజా హుస్సేన్. ఏడు లక్షలకు బేసిక్ బైక్ కొని.. మాడిఫికేషన్ కోసం 18 లక్షలు ఖర్చు చేసి స్పోర్ట్స్ మోడల్స్‌ను తలదన్నేలా తయారు చేశాడు. ‘ఈ బైక్ టైర్స్ మిగతా వాటికంటే పూర్తిగా భిన్నమైనవి. విమాన చక్రాలకు వినియోగించే అత్యుత్తమ మెటీరియల్‌ను వాడాం. కేవలం టైర్లకే రూ.5 లక్షలు ఖర్చు పెట్టాం’ అని చెబుతున్నాడు హుస్సేన్. హైదరాబాదీ తయారు చేసిన ఈ ైబె క్‌ను చూసినవారెవరైనా కచ్చితంగా ఇంపోర్టెడ్ అనడం ఖాయం.
మరికొన్ని...
సాధారణంగా వీల్ చైర్‌ను కంట్రోల్ చేయడానికి జాయ్‌స్టిక్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌తో వీల్ చైర్‌ను కంట్రోల్ చేయవచ్చని నిరూపించారు బీవీ రాజు ఇనిస్టిట్యూట్ విద్యార్థులు. అంతేకాదు.. సాంకేతికతను ఉపయోగించి వీల్ చైర్‌కు ఓ బెల్ట్‌ను యాడ్ చేశారు. దీన్ని చేతికి పెట్టుకుంటే బీపీ, హార్ట్ అటాక్‌లను గమనించి హెచ్చరించడం ఇందులో విశేషం. అలాగే అంధుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్పీకింగ్ మ్యాప్.. ఫొటోలు, వీడియోలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసుకునేందుకు కనిపెట్టిన సరికొత్త ఆన్ లైన్ డైరీ ‘మెమిలాగ్’ వంటివి ఈ ఫెస్ట్‌లో ప్రత్యేక ఆక ర్షణగా నిలిచాయి.