భారీ ప్యాకేజీతో గూగుల్ జాబ్.. ట్విస్ట్!
చండీగఢ్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌లో రూ.1.44 కోట్ల వార్షిక ప్యాకేజీతో చండీగఢ్ బాలుడు హర్షిత్ శర్మ(16) ఉద్యోగం సంపాదించినట్టు ఆన్లైన్ మీడియా, ట్విటర్లో మంగళవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. చండీగఢ్ సెక్టార్ 33లో ఉన్న ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివిన అతడికి గూగుల్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా ఉద్యోగం వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై చాలా మందికి అనుమానాలు తలెత్తాయి. చివరికి అదే నిజమైంది. ఇదంతా కల్పితమని తేలింది.
హర్షిత్ శర్మకు తాము ఎటువంటి ఉద్యోగం ఇవ్వలేదని గూగుల్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. అతడికి ఉద్యోగం ఇచ్చినట్టు తమ దగ్గర ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు. ఈ వ్యవహారం గురించి హర్షిత్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇంద్ర బేణివాల్‌ను సంప్రదించగా.. 'ఈ ఏడాదే అతడు తమ స్కూల్ నుంచి పాసయ్యాడు. ఒకరోజు మా దగ్గరికి వచ్చి తనకు గూగుల్‌లో జాబ్ వచ్చిందని చెప్పాడు. జాబ్ లెటర్‌ను వాట్సాప్‌లో నాకు పంపించాడు. పొరపాటున దాన్ని డిలీట్ చేశాను. హర్షిత్‌కు గూగుల్ ఉద్యోగం ఇచ్చినట్టులో జాబ్ లెటర్లో ఉంద'ని తెలిపారు. సైన్స్ విభాగంలో ఐటీ విద్యను అభ్యసించిన హర్షిత్ చదువులో యావరేజ్‌గా ఉండేవాడని, ప్రాక్టికల్స్ లో మాత్రం మంచి ప్రతిభ కనబరిచేవాడని వెల్లడించారు. డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా అతడు గతంలో పీఎంవో కార్యాలయం నుంచి రూ .7వేలు బహుమతిని కూడా అందుకున్నాడని గుర్తు చేశారు. అయితే అతడికి ఎందుకు బహుమతి ఇచ్చారనే దానిపై స్పష్టత లేదు.
కురుక్షేత్ర ప్రాంతానికి చెందిన అతడిని సంప్రదించేందుకు మీడియా ప్రయత్నించగా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసివుంది. అయితే స్కూల్స్ నుంచి గూగుల్ రిక్రూట్ చేసుకోదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హర్షిత్ మాటలు నమ్మి ఈ నెల 29న చండీగఢ్ ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీన్నే మళ్లీ చండీగఢ్ డీపీఆర్ విడుదల చేయడంతో ఈ వార్త విస్తృతంగా చక్కర్లు కొట్టింది.
ప్రాథమిక కథనం:
చదువు ఇంటర్..జీతం నెలకు రూ.12లక్షలు