ఆ రైతులు క్రిమినల్స్, పిరికివాళ్లు..
హర్యానా: రైతుల ఆత్మహత్యలపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు పిరికివాళ్లు, క్రిమినల్స్ అని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. అలాంటివారికి తాము ఎందుకు సాయం చేస్తామని మంత్రి ఓపీ ధన్కర్ ప్రశ్నించారు.
భారతీయ చట్టాల ప్రకారం ఆత్మహత్యలు చేసుకోవటం నేరమని ధన్కర్ అన్నారు. చట్టాన్ని అతిక్రమించి ప్రాణాలు తీసుకునేవారు చట్టప్రకారం నేరస్తులేనని, అటువంటి వారికి ప్రభుత్వం సాయం చేయదని ఆయన పేర్కొన్నారు. పిరికివాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటారని, తమ బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ఆత్మహత్యలను చేసుకుంటున్నారని ధన్కర్ విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకూడదన్నారు. కాగా ఓ వైపు రైతుల ఆత్మహత్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతుంటే...మరోవైపు మంత్రి అనాలోచిత వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.