Covid Vaccine: శభాష్ అన్నా.. చేతులు లేకపోతేనేం!
రాంచీ: ప్రస్తుత పరిస్థితిలో కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని కేంద్రం భావిస్తోంది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కానీ కొంతమంది ఈ వ్యాక్సిన్ మంచిది కాదు, ఆ వ్యాక్సిన్ పనిచేయదు.. వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ఎఫెక్ట్స్ అనే భయంతో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారికి ఆతీతంగా రెండు చేతులను కోల్పోయిన ఓ వ్యక్తి ఆదర్శంగా నిలిచాడు. జార్ఖండ్‌లోని సింఘ్‌భూమ్ జిల్లా మనోహర్పూర్ బ్లాక్‌కు చెందిన మారుమూల గ్రామ నివాసి గుల్షన్ లోహ్రా బాధ్యతాయుతమైన పౌరుడుగా వ్యవహరించాడు.
రెండు చేతులను కోల్పోయిన గుల్షన్ లోహ్రా తన తొడపై వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆరోగ్యకరమైన వ్యక్తికి ఎడమ చేతికి వ్యాక్సినేషన్ చేయాలి కాని ఇతడు రెండు చేతులను కోల్పోవడం వల్ల ఎడమ తొడకు ఇవ్వవలసి వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఏదేమైనా కరోనాను దూరంగా ఉంచేందుకు, వైరస్ నుంచి తనను తాను రక్షించుకునేందుకు వ్యాక్సిన్ తీసుకున్నట్లు గుల్షన్ తెలిపాడు. వ్యాక్సినేషన్ అనంతరం తనకు ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదని.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరాడు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మరణం సంభవించడం, జ్వరం, నపుంసకత్వం వంటి భయాలతో గుమ్లా, ఖుంటి, సిమ్దేగా, వెస్ట్ సింఘ్భుం, ఇతర గిరిజన జిల్లాల ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకునేందుకు భయపడుతున్నారు. గుల్షన్ ఆదర్శంగా తీసుకుని అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అధికారులు కోరారు.
చదవండి:కోట్లు విలువ చేసే పదార్థం అమ్మే ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్