ఆరోగ్య రక్ష... అందని ద్రాక్ష
వైరా: రేపటి పౌరులైన బాలలకు సకాలంలో సరైన పోషకాహారం అందించేందుకు, ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన జవహర్ బాలల ఆరోగ్య రక్ష పథకం వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగా అటకెక్కింది. మూడేళ్ల కిందట ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ఇప్పటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో మాత్రం అమలవడం లేదు.
గుర్తింపు కార్డులతో సరి
జిల్లాలో ఈ ఏడాది ఒకటోతరగతిలో విద్యార్థులకు కూడా ఆరోగ్య రక్ష కార్డులు పంపిణీ చేసి సరిపెట్టారు. వైద్య పరీక్షలు మాత్రం నిర్వహించలేదు. ప్రాథమిక పాఠశాలల్లో 1,39,151 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 86,266 మంది, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో 46,644 మంది విద్యార్థులకు ఆరోగ్య రక్ష కార్డులు మంజూరయ్యాయి. ఈ పథకం కింద విద్యార్థులకు ప్రధానంగా సాధారణ స్క్రీనింగ్ పరీక్షలతోపాటు రక్తహీనత, కామెర్లు, కాళ్ళ వాపు, కంటి చూపు, మానసిక-శారీరక వైకల్యం తదితర పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య రక్ష కార్డుల్లో నమోదు చేయాలి. ఇలా ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలి. అనేక పాఠశాలలకు వైద్యులు వెళ్లనే లేదని సమాచారం.
కమిటీ విధులు, విధానాలు
ఆరోగ్య రక్ష పథకం అమలుకు మండలస్థాయిలో ఎంపీడీఓ చైర్మన్గా; ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, ఎంఈఓలు సభ్యులుగా కమిటీలు ఏర్పాటయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాలను ఈ కమిటీ సందర్శించి పిల్లలకు వైద్య పరీక్షలు జరిగేలా చూడాలి. ప్రతి మంగళవారం ‘ఆరోగ్యం రోజు’గా పాటించేలా చూడాలి. ప్రత్యేక చికిత్స అవసరమైన వారిని రెఫరల్ ఆస్పత్రులకు తరలించాలి. వైద్య పరీక్షల విషయంలో ఉపాధ్యాయులు, హెచ్ఎం కూడా భాద్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిలిపించి వివరాలు తెలుసుకోవాలి. తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు, గ్రేడుల వివరాలు ప్రగతి రికార్డులో నమోదయ్యాయో లేదో పరిశీలించాలి. కానీ, ఇవేవీ అమలవడం లేదు. మొత్తంగా చూస్తే.. ఈ పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది.