మహిళకు గుండెపోటు వచ్చినా.. రైలు ఆగలేదు!
లోకల్ రైల్లో వెళ్తున్నప్పుడు మీ గుండె ఆగిపోయినా.. ఆ రైలు మాత్రం ఆగదు! అవును.. ముంబైలో సరిగ్గా ఇలాగే జరిగింది. 71 ఏళ్ల వయసున్న మహిళ చర్చిగేట్ స్టేషన్‌కు వెళ్లే లోకల్ రైలు ఎక్కారు. ఆమెకు గుండెపోటు వచ్చి దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది. కానీ రైలును ఆపేందుకు ఉండే చైన్లు ఆ సమయానికి పనిచేయలేదు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో తోటి ప్రయాణికులు ధైర్యం చేసి కదులుతున్న రైల్లోంచి ఆమెను బయటకు లాగి అత్యవసరంగా వైద్య సేవలు అందేలా చూశారు.
కమలేష్ బెహల్ (71) చాలాకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ఆమెకు గుండెపోటు వచ్చింది. ముంబై లోకల్ రైల్లో మహిళల ఫస్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణం చేస్తుండగా.. ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే దాదాపు ప్రాణాలు పోయేవి. ఆ విషయాన్ని అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న మరో మహిళ గమనించారు. రైలు ఆపేందుకు చైన్ లాగినా రైలు మాత్రం ఆగలేదు. బోగీలో ఉన్న ఏ చైనూ పనిచేయలేదు. రైలు స్టేషన్ వద్దకు సమీపిస్తుండగా కొంత స్లో అయింది. వెంటనే ఆ పక్కనున్న మహిళలు ఆమెను బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి.