'రథయాత్ర' లో వైద్యులకు నో లీవ్
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో జూలై 1 నుంచి ఆగస్టు వరకు జరగనున్న పూరీ జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని 280 మంది వైద్యులు, 650 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు అందించనున్నట్టు ఒడిషా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. నబకాలేబర్ గా పిలిచే ఈ పవిత్ర ఉత్సవంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. జగన్నాథ ఆలయం వద్ద స్వామి వారి తోబుట్టువుల పాత ప్రతిమలను మార్చి వాటి స్థానంలో కొత్త దేవతల ప్రతిమలు ప్రతిష్ఠించి ఈ ఉత్సవాలు చేసుకుంటారు. ఈ ప్రతిమల ఊరేగింపు కార్యక్రమం జూలై 18న జరగనుంది. రథయాత్ర ఊరేగింపులో భక్తులకు సౌకర్యార్థం అత్యవసర చికిత్స అందుబాటులో ఉండేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైద్యులకు, పారామెడికల్ వైద్యసిబ్బందికి సూచనలు చేసింది.
ఎవరైనా దీనికి రాలేమని చెబితే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అత్ను సబ్యాషి నాయక్ మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో ఒడిషా ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించనుంది. ఈ యాత్ర సమయంలో వైద్యులకు సెలవులు మంజూరు చేయబోమంటూ తేల్చిచేప్పేసింది. ఏదైనా అత్యవసరమైతే తప్ప వైద్యులకు సెలవులు మంజూరు చేస్తామని, దానికి కూడా వైద్య కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. రథ యాత్ర జరిగే ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకూ వైద్యల కొరత లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వైద్యులను కూడా రప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రథయాత్రకు 50 లక్షల మంది వరకు భక్తులు తరలిరానున్నట్టు ఒడిషా ప్రభుత్వం అంచనా వేస్తోంది.