38 మంది వృద్ధుల సజీవ దహనం
చైనాలో భారీ అగ్ని ప్రమాదం
బీజింగ్: చైనాలోని హెనాన్ రాష్ట్రంలో సోమవారం ఓ ప్రైవేట్ వృద్ధాశ్రమంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 38 మంది వృద్ధులు సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పింగ్దింగ్షాన్ సిటీలోని లూషాన్ కౌంటీలో ఉన్న కాంగ్లెయూవాన్ రెస్ట్ హోంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతదేహాలు గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి. సోమవారం సాయంత్రం మొదలైన మంటలు మొత్తం వృద్ధాశ్రమంలోని భవనాలన్నింటికి వ్యాపించాయని, గంట తర్వాత వాటిని ఆర్పేశామని అధికారులు తెలిపారు. వృద్ధాశ్రమంలో మొత్తం 51 మంది వృద్ధులు ఉండేవారని చెప్పారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మంటల ధాటికి భవనాలు కూలిపోయి బూడిద కుప్పలా మారిపోయాయి. తన గదిలో 11 మంది ఉండేవారని, తనతోపాటు మరొకరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డామని జావో యులాన్ అనే మహిళ చెప్పింది. రెస్ట్ హోం లీగల్ ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.