భలే ఆప్స్
మీరు గానీ ఒక ఈలగానీ వేస్తే...
ఈల వేస్తే గుర్రం పరుగెత్తుకుంటూ రావడం సినిమాల్లో చూసుంటాం. మరి ఇదే మాదిరిగా మీ ఫోన్ కూడా వచ్చేస్తుందా? ‘విజిల్ మీ ఫ్రీ’ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే పరుగెత్తుకుంటూ రాకపోవచ్చుగానీ... తాను ఎక్కడున్నదీ చెప్పేస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా అంతా టెక్నాలజీ మహిమ. మీ ఈలకు ఎలా స్పందించాలన్నది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు రింగ్‌టోన్‌ను స్పందనగా పెట్టుకోవచ్చు. లేదంటే.. ‘ఐ యామ్ హియర్’ అని పలికేలానూ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడబడితే అక్కడ పెట్టేసి మరచిపోయే వాళ్లకు చక్కటి అప్లికేషన్ ఇది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తుంది.
దారి చూపే ‘నావీమ్యాప్స్’
గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయమీ అప్లికేషన్. భారతదేశానికి సంబంధించిన ప్రత్యేక ఫీచర్లతో దీన్ని సిద్ధం చేసింది మ్యాప్‌మై ఇండియా సంస్థ. రెండు నెలల క్రితం ఆండ్రాయిడ్ ఫోన్లకు, తాజాగా ఐఫోన్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ఏకకాలంలో మూడు దారులు చూపే ఈ నావిగేషన్ అప్లికేషన్‌తో మీరు ఉన్న ప్రాంతంతోపాటు రూట్‌మ్యాప్‌ను ఫేస్బుక్, ఈమెయిల్, మెసేజ్‌ల ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు కూడా. ఐఫోన్ 5, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫ్రోయో వెర్షన్ లేదా అంతకంటే తాజా ఓఎస్‌తో పనిచేస్తుందీ అప్లికేషన్. ఇవి ఉచితంగా లభించే అప్లికేషన్ ఫీచర్లు కాగా, రూ.620 చెల్లించి డౌన్లోడ్ చేసుకోగల ప్రొఫెషనల్ వెర్షన్లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. మార్గమధ్యంలో ఎప్పుడు ఎటువైపు తిరగాలో ఇంగ్లీషుతోపాటు పది భారతీయ భాషల్లో సూచించడం వంటివి దీన్లో ఉన్నాయి.
బ్యాంబూ పేపర్...
స్మార్ట్‌ఫోన్‌లో నోట్స్ రాసుకునేందుకు అప్లికేషన్లు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది ‘బ్యాంబూ పేపర్’. కాకపోతే కొంచెం తేడా ఉంది. మిగిలినవి టైప్ చేయాల్సి వస్తే... ఈ అప్లికేషన్‌ను సై ్టలస్తోనూ వాడుకోవచ్చు. అక్షరాలను టైప్ చేసుకోవడంతోపాటు చిన్నచిన్న గ్రాఫ్‌లు, బొమ్మల్ని గీసుకోవడం కూడా సై ్టలస్తో సాధ్యమవుతుంది. నోట్స్‌కు ఫొటోలు జతచేయగలగడం, విండోస్ 8తోపాటు సోషల్ మీడియా, డ్రాప్‌బాక్స్, టంబ్లర్ వంటి క్లౌడ్ ఆధారిత సర్వీసుల ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. స్కెచ్‌లు గీసేందుకు, రాసుకునేందుకు వేర్వేరు సై ్టలస్లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉచితంగానే లభించినప్పటికీ సరిపోయే సై ్టలస్ల ధర మాత్రం రూ.700 నుంచి మొదలవుతుంది.