ఢాకా ఉగ్రవాది బెంగాల్లో దాక్కున్నాడా..!
కోల్కతా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహాన్ని రచించిన కీలక ఉగ్రవాది భారత్లోనే తల దాచుకున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అతడు పశ్చిమ బెంగాల్లో ఏదో ఒక చోట ఉండి ఉంటాడని బంగ్లాదేశ్ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే భారత్ అధికారులతో పంచుకోనున్నారట. ఢాకాలో ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు 22 మందిని దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
ఈ దాడి జరిగిన వెంటనే దాదాపు వందమంది 20 ఏళ్లలోపు యువకులు కనిపించకుండా పోయారని, వారిలో కీలక వ్యూహకర్త కూడా ఉన్నాడని అంటున్నారు. భారత్-బంగ్లాదేశ్ ఒప్పందాల ప్రకారం ఉగ్రవాద సమస్యను ఉమ్మడిగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా సలహాదారు గవార్ రిజ్వి చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన భావిస్తున్న ప్రకారం ఢాకాలోని గుల్షాన్ రెస్టారెంట్ పై దాడికి వ్యూహాన్ని రచించన వ్యక్తి గత ఏడు నెలల కిందటే దేశం విడిచి భారత్లోకి అడుగుపెట్టాడు. బెంగాల్లోని ఏదో ఒక మూల తలదాచుకుని ఉంటాడు. అతడికోసం వారు తీవ్రంగా గాలిస్తున్నారు.