‘నిరుద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి’
హిందూపురం అర్బన్ : నిరుద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతోందని రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి గెలిచాక మోసం చేశారన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు వెంటనే నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే సీపీఎస్ పద్ధతిని ఎత్తివేసి పాతపద్ధతినే కొనసాగించాలన్నారు. మహిళ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న చైల్డ్ కేర్ సెలవులను రాష్ట్రప్రభుత్వం అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధన lకోసం రాజీ లేని పోరాటం సాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ లెక్చరర్ రామచంద్రారెడ్డి, అడ్వకేట్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.